వైసీపీ ఎమ్మెల్యేలు జనంలోకి వెళ్లేందుకు సీఎం జగన్ ముహుర్తం ఖరారు చేశారు. అయితే ఇప్పటి వరకూ వారు జనంలో లేరా అనే డౌట్ ఎవరికైనా వస్తుంది. ఎమ్మెల్యేలు అత్యధిక మంది జనంలో తిరగడం ఎప్పుడో మానేశారు. జనంలో తిరిగి తమ ఊరికి రోడ్లడుగుతారు.. డ్రైనేజీలుఅడుగుతారు.. సంక్షేమ పథకాలు అడుగుతారు… అభివృద్ధి అడుగుతారు.. ఇలా చెప్పుకుంటూ పోతే అడిగేవి చాలా ఉంటాయి..కానీ ప్రభుత్వం చేసేది చాలా అంటే చాలా తక్కువ. లబ్దిదారులు ఎదురేగి స్వాగతం పలికినా ప్రశ్నించేవారుఅంత కంటె రెండింతలు ఎక్కువ ఉంటారు. అందుకే ఎమ్మెల్యేలు చాలా వరకూ పర్యటనలు తగ్గించుకున్నారు.
ఇటీవల గోదావరి జిల్లాల్లో ఓ ఎమ్మెల్యే ఓ ఊరికి వెళ్తే తమ ఊళ్లోకి రావొద్దని చెప్పి వెనక్కి పంపేశారు. ఇలాంటి పరిస్థితుల నడుమ సీఎం జగన్ వచ్చే ఎన్నికలకు సిద్ధం కావడానికి చాలా పెద్ద టాస్కే ఎమ్మెల్యేకు ఇచ్చారు. మే నుంచి అందరూ జనంలోకి వెళ్లాలని అప్పటికి ఎన్నికల అజెండా సిద్ధం చేసుకుందామని వివరించారు. ఎమ్మెల్యేలందరికీ ఈ అంశంపై స్పష్టమైన దిశానిర్దేశం వస్తుందని కూడా జగన్ చెప్పారు. జూలైలో ప్లీనరీ నిర్వహించే సమయడానికి పార్టీ పని ప్రారంభం కావాలని జగన్ తీర్మానించేశారు.
నిజానికి గతంలో మార్చి నుంచే జనంలోకి పోదామని జగన్ ఓ కేబినెట్ భేటీలో పేర్కొన్నారు. తమతో పాటు పీకే కూడా వస్తారని చెప్పారు. ఈ సారి మాత్రం పీకే నుంచి ఎలాంటి ప్రస్తావన చేయలేదు. మే నుంచి జనంలోకి వెళదామని సూచించారు. సీఎం అయిన తర్వాత జగన్ .. క్యాంపాఫీస్ నుంచి బయటకు వచ్చిన సందర్భాలు తక్కువే. జిల్లాల పర్యటనలు చేపట్టలేదు. ఆయన కూడా జనంలోకి ఎప్పటి నుంచి వస్తారో.. ఎమ్మెల్యేలు కూడా అప్పట్నుంచేచురుగ్గా జిల్లాల పర్యటనలకు వెళ్లే అవకాశం ఉంది.