న్యాయవ్యవస్థ పరిమితులపై అసెంబ్లీలో చర్చించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరో వైపు ఆయనపై అక్రమాస్తుల కేసులో కొత్త కొత్త కోణాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సీబీఐ పైపైన విచారణ జరిపి వదిలేసిందని..అత్యంత కీలకమైన సూటక్ కేసు కంపెనీలు, విదేశీ నిధులు ఎక్కడ నుంచి వచ్చాయన్నదానిపై వివరాలు సేకరించలేదని.. తెలంగాణ హైకోర్టులో ఎంపీ రఘురామ పిటిషన్ వేశారు. ఆ వివరాలు మొత్తం బయటకు తీసుకు వచ్చి సమగ్ర విచారణ జరిపించేలా సీబీఐ, ఈడీని ఆదేశించాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. విచారణకు రావడం లేదు. దీనిపై ఆయన మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను వివిధ కారణాలు చూపుతూ రిజిస్ట్రినే నిలిపివేశారు.
పిటీషన్ విచారణకు అర్హత ఉందా? లేదా? అన్నది ధర్మాసనం తేలాల్సి ఉందని వెంటనే ఆ పిటీషన్ కు నెంబరు కేటాయించాలనిర రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో 11 అభియోగపత్రాలను దాఖలు చేసిన సీబీఐ.. విదేశాలనుంచి, బోగస్ కంపెనీలనుంచి జగన్ కంపెనీల్లోకి వచ్చిన పెట్టుబడులపై దర్యాప్తు చేయకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖలకు లేఖ రాసి వదిలేసిందని పిటిషన్‌లోరఘుురామ వివరించారు. 2004లో రూ.11 లక్షల ఆదాయమున్న జగన్ 2009లో తండ్రి చనిపోయేనాటికి రూ.43 వేల కోట్లు ఆర్జించారని ఎంపీ రఘురామకృష్ణరాజు తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
హౌరా, కోల్‌కతా, గువాహటిల్లోని 16 చిన్న కంపెనీల నుంచి రూ.195.70 కోట్ల పెట్టుబడులు జగతిలోకి వచ్చాయని, వీటిపై దర్యాప్తును ఐటీ, ఈడీలకు లేఖ రాయటంతో సరిపెట్టిందన్నారు. వీటిపై సమగ్ర దర్యాప్తు చేయాలని రఘురామ కోరుతున్నారు. అక్రమాస్తుల కేసు విచారణ ఆలస్యమవుతోందని ప్రత్యేక కోర్టును ఏర్పాటుచేసేలా ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు.ఈ పిటిషన్‌కు విచారణ అర్హత ఉందని హైకోర్టు తేలిస్తే.. సీబీఐ, ఈడీలు ఈ సారి అక్రమాస్తుల కేసు మూలాల్లోకి వెళ్లే అవకాశం ఉంది. అదే జరిగితే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.