ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకూ అప్పో సప్పో చేసి మీటలు నొక్కుతూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ టైం ప్రకారం ఇస్తూ లబ్దిదారులకు ఓ నమ్మకం కలిగించారు. కానీ ఇప్పుడు ఆర్థిక సమస్యలు చుట్టుముడుతూండటంతో పథకాలకు మీటలు నొక్కడం కూడా క్రమంగా వాయిదా పడుతూ వస్తోంది. ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకం కింద గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ రోజు విద్యార్థుల తల్లులు ఖాతాల్లో నగదు జమ చేయాల్సి ఉంది. కానీ వాయిదా వేస్తున్నట్లుగా ప్రభుత్వం చివరి క్షణంలో ప్రకటించింది. అయితే డబ్బుల్లేవని ప్రభుత్వం చెప్పుకోలేదు.. సీఎం జగన్ మహిళా దినోత్సవంలో పాల్గొంటున్న కారణంగా బిజీగా ఉన్నారని అందు వల్ల మీట నొక్కలేకపోయారని కారణాన్ని ప్రభుత్వం చెప్పింది.
దీంతో విద్యార్థుల తల్లలకు నిరాశ ఏర్పడింది. నిజానికి ఇదే కారణం అయితే.. సాయంత్రం మీట నొక్కవచ్చు. ఉదయం మహిళా దినోత్సవ వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. సాయంత్రం మీట నొక్కే కార్యక్రమం ఏర్పాటు చేయవచ్చు. కానీ నిధుల సమస్య వల్లనే మీట నొక్కలేకపోయారనేది అనధికారిక సమాచారం. దాదాపుగా పదకొండు లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. ఏడు వందల కోట్లను జమ చేయాల్సి ఉంది. సాధారణంగా ఇవి కాలేజీలకు జమ చేయాలి. కానీ ప్రభుత్వం విధానం మార్చుకుని తల్లలకు జమ చేయడం ప్రారంభించింది. వారు తీసుకెళ్లి కాలేజీలకు కట్టాలి. అయితే ప్రభుత్వం ఇవ్వకపోతే వారు కూడా కాలేజీకలకు కట్టరు.
దీంతో అటు తల్లులు.. ఇటు విద్యాసంస్థలు కూడా ప్రభుత్వం నిధులు ఎప్పుడు విడుదల చేస్తుందో అని ఎదురు చూడక తప్పడంలేదు. ఇప్పటికే అమ్మఒడి పథకాన్ని జనవరి నుంచి జూన్‌కు మార్చారు. పలు పథకాల మీటలు నొక్కడం ఇటీవల ఆలస్యం అవుతోంది. ఈ క్రమంలో ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా ఆలస్యం కావడం లబ్దిదారుల్లో ఆందోళనకు కారణం అవుతోంది.