ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు వైసీపీ నేతల్ని సంతోషపరుస్తోంది. ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాల్లో నిబంధనలను కూడా పట్టించుకోకుండా ఇష్టారీతిన రుణాలు తెచ్చుకోవడానికి సహకరిస్తోంది. ఎప్పుడో రుణ పరిమితి దాటిపోయినా ఎప్పటికప్పుడు ఆర్బీఐ నుంచి ప్రతి మంగళవారం రూ. రెండు వేల కోట్ల రుణానికి అనుమతి ఇస్తోంది. సాధారణ ప్రజలు హోమ్ లోన్లు తీసుకునేంత కన్నా ఎక్కువ వడ్డీ చెల్లించడానికి ఏపీ సిద్దపడుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం అయిపోయే నాటికే ఆర్బీఐ వద్ద రూ. యాభై వేల కోట్లు.. బహిరంగ మార్కెట్ నుంచి మరో రూ. 70 వేల కోట్ల వరకూ అప్పులు చేసే అవకాశం ఉంది. ఇదంతా కేంద్రం చలువతోనే జరిగింది.
కేంద్రానికి ఏపీ ఆర్థిక పరిస్థితిపై స్పష్టమైన అవగాహన ఉంటుంది. లేకుండా ఉండే అవకాశం లేదు. ప్రభుత్వం నిధుల వినియోగం ఆర్బీఐ ద్వారానే చేయాలి. అయితే ఏపీ నుంచి అధికారికంగా లెక్కలు వస్తేనే తెలుస్తుందన్నట్లుగా వ్యవహరిస్తోంది. వివరణ అడుగుతోంది. అసలు లోటు ఎంతో చెప్పాలని తాజాగా లేఖ రాసింది. కాగ్ నివేదికలో ప్రతి నెలా లోటు ఎంతో స్పష్టంగానే ఉంది. లెక్కలతోనే కాగ్ రిపోర్ట్ చేస్తుంది. కానీ ేపీ అధికారుల్ని వివరణ అడుగుతూ.. కేంద్రం కాలం గడుపుతోంది.
ఏపీలో ఆర్థిక పరిస్థితి ఇప్పటికే పూర్తిగా దిగజారిపోయింది. టీ, కాఫీలు సరఫరా చేసే కాంట్రాక్టర్లకూ బిల్లులు చెల్లించలేని దుస్థితి నెలకొంది. రేపో మాపో రుణాలు ఇచ్చిన వారికి తిరిగి చెల్లింపులు చేయలేక డిఫాల్ట్ అవుతారన్న ప్రచారమూ జరుగుతోంది. ఇంత సీరియస్ గా పరిస్థితి ఉన్నా కేంద్రం ఎందుకు స్పందించడం లేదనేది ఇప్పుడు చర్చనీయాంశఁగా మారింది. జగన్పై అభిమానంతోనే చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు.. . బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. కానీ తప్పు చేస్తూంటే చూసీ చూడనట్లుగా ఉండటం వల్ల ఎవరికి నష్టమన్న ప్రశ్న మౌలికంగా వస్తోంది.
ఏపీ ఆర్థిక పరిస్థితి కుప్పకూలితే కేంద్రం ఒక్క రూపాయి సాయం చేయదు. మా ఆప్తుడు జగన్ అని కేంద్రం… నిధులు ఇచ్చే అవకాశమే లేదని పోలవరం వంటి చట్టపరమైన అంశాల్లో కొర్రీలు పెట్టినప్పుడే తేలిపోతుంది. మరేం జరుగుతుంది..? ప్రభుత్వం కుప్పకూలిపోతూంటే.. కేంద్రం ప్చ్ అనడం మినహా మరేమీ చేయలేదు. అంతిమంగా జగన్ ప్రభుత్వం దివాలా తీయడాన్ని చూడటానికి కేంద్రం కూడా ఆసక్తి చూపిస్తోంది. అయితే దీని వల్ల నష్టపోయేది వైసీపీనో.. జగనో కాదు.. ఏపీ.. ఏపీ ప్రజలు. ఈ విషయాన్ని ఎప్పుడు గుర్తిస్తారో మరి !