మరో రెండు రోజులే. `రాధే శ్యామ్` బొమ్మ పడిపోతుంది. రూ.300 కోట్ల సినిమా జాతకం తెలిసిపోతుంది. ఈ సినిమా ఏ క్షణంలో మొదలెట్టారో, చిత్రీకరణ సా….గు…తూ….నే ఉంది. ఎట్టకేలకు పూర్తయ్యింది. అయితే ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూ, తగ్గుతూ రావడం విచిత్రం. సినిమా మొదలెట్టినప్పటి హైపు మధ్యలో లేదు. అయితే విడుదలకు ముందు అనూహ్యమైన హైప్ క్రియేట్ అయ్యింది. విడుదలకు ముందు ఈ క్రేజ్ ఉండడం సంతోషించాల్సిన విషయమే.
రూ.300 కోట్ల తో రూపొందిన సినిమా ఇది. అలాగని చారిత్రక, జానపద, గ్రాఫిక్స్ హంగులు కావల్సిన సినిమా కాదు. ఓ ప్రేమకథకు రూ.300 కోట్లు ఖర్చు పెట్టడం విచిత్రమే. కానీ పరిస్థితులు, ఈ సినిమా కోసం ఎంచుకున్న నేపథ్యం బడ్జెట్ ని పెంచేశాయి. ముఖ్యంగా సెట్స్‌కి ఎక్కువ ఖర్చయ్యింది. ఈ సినిమా కోసం ఏకంగా 101 సెట్స్ వేశారు ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్. బహుశా.. టాలీవుడ్ లో ఇదో రికార్డేమో.? బాహుబలి కోసం కూడా ఇన్ని సెట్లు వేయలేదు. ఈ సినిమా ఇటీవల కొంతమంది ప్రముఖులు చూశారు. వాళ్లంతా సెట్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించార్ట. ఎస్.ఎస్.రాజమౌళి ఈ సినిమా చూసి `ఆర్ట్ విభాగం పనితనం చాలా బాగుంది. కచ్చితంగా ఈ సినిమాకి ఆర్ట్ లో నేషనల్ అవార్డు వస్తుందనిపిస్తోంద`ని కాంప్లిమెంట్ ఇచ్చారని తెలుస్తోంది. ఆయన దర్శకత్వం వహించిన `ఆర్.ఆర్.ఆర్`లోనూ సెట్స్‌కి ప్రాధాన్యం ఉంది. అయినా సరే, అయిన `రాధేశ్యామ్`ని ప్రత్యేకంగా మెచ్చుకున్నారంటే.. విశేషమే. ఈ సినిమా కోసం నాలుగు ట్రైన్ సెట్స్ వేశారు రవీందర్. ఓ భారీ షిప్ సెటప్ కూడా ఉంది. నిజానికి ఇటాలియన్ కల్చర్‌లో ఓ ఇండియన్ సినిమా, అందులోనూ తెలుగు సినిమా తీయడం ఇదే తొలిసారి. ఇటలీ కట్టడాల్ని పోలిన నిర్మాణాలు హైదరాబాద్‌లో సెట్స్ రూపంలో తీర్చిదిద్దారు. అక్కడి ట్రైన్ సెటప్ మొత్తం ఇక్కడ రీ క్రియేట్ చేశారు. క్లైమాక్స్ అంతా షిప్ లోనే. ఈ తరహా క్లైమాక్స్ తెలుగులోనే కాదు, ఇండియన్ స్క్రీన్ పైనే చూడలేదంటున్నారు. సాధారణంగా షిప్ అనగానే.. పైకి కనిపించే సెటప్ ఒకటి సెట్ చేస్తే చాలు. కానీ.. దాని మెకానిజం, ఇంజన్ కూడా సృష్టించడం… ఈ సినిమా ప్రత్యేకత.