కూత లేకనే వచ్చెను ‘ప్రభు’వు రైలు బడ్జెట్టు
ప్రైవేటుకు పెద్దపీట వేయు గొప్ప కనికట్టు!
వైఫై గట్రా సేవలు సరికొత్త తరం చాక్లెట్టు
ధరల మోత మోగలేదు… జనానికది బిస్కట్టు!!
వసతులు అను ఊసు తప్ప విస్తరణల బాస లేదు
కొత్త మార్గాలూ రైళ్లనసలు ప్రకటించిన జాడ లేదు
తెలుగు జనుల ఆశలపై ఘనముగ చిలకరించె నీళ్లు
కొత్త రాష్ట్రాల కోటి కోర్కెలకే సమాధులౌ ఆనవాళ్లు
ఎలాంటి ప్రత్యేకతలు లేకుండా సురేశ్‌ప్రభు రైల్వేబడ్జెట్టును ప్రతిపాదించేశారు. 1.21 లక్ష ల కోట్ల ఖర్చును చూపించారే తప్ప.. అంత భారీ ఖర్చు వలన కొత్తగా ఏర్పాటు అవబోతున్న ఫ్యాక్టరీలు, కొత్త రైలు మార్గాలు ఏమీ కనిపించడం లేదు. అయినా సురేశ్ ప్రభు మొత్తానికి మమ అనిపించారు. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలకు మాత్రం ఆయన బడ్జెట్లో వంచన జరిగిందనే చెప్పాలి. ఇటు తెలంగాణకు గానీ.. అటు ఆంధ్రప్రదేశ్‌కు గానీ పెద్దగా ఒరిగిందేమీ లేదు.
ఈ రెండు రాష్ట్రాలు కూడా ఈసారి చాలా ఆశలు పెట్టుకున్నాయి. ఏపీ సర్కారు ఎన్డీయేలో భాగస్వామే కాగా, తెరాస కూడా అంతో ఇంతో స్నేహంగానే మెలగుతోంది. దానివల్ల తమ రాష్ట్రాలకు లబ్ధి ఉంటుందని వారు భావించారు. కానీ.. సురేశ్ ప్రభు వారినందరినీ కూడా దారుణంగా నిరాశపరిచారు.