గత ఏడేళ్లుగా ఎక్కడ ఎన్నికలు జరిగినా వినిపిస్తున్న శబ్ద నినాదమే గురువారం కూడా మీడియాలో మార్మోగింది. వికసించిన కమలం అనే పడికట్టు పదానికి ఈ సారి పుష్ప సినిమా డైలాగ్‌ను అందరూ ఉపయోగించారు. బీజేపీ అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అన్నారు. ఇంకా ఎవరి క్రియేటివిటీకి తగ్గట్లుగా వారు బీజేపీ విజయాన్ని అభివర్ణించారు. ఏడేళ్లుగా తిరుగులేని విజయాలు సాధిస్తున్న బీజేపీకి ఇవి అలవాటైపోయాయి. పైగా రెండేళ్ల కిందటి నుంచే సర్వేల ద్వారా ఐదింటిలో నాలుగు చోట్ల బీజేపీ గెలుస్తుందని ప్రజల్లోకి వెళ్లిపోయింది. దీంతో ప్రజలకూ అంత ఆశ్చర్యపోయే ఫలితాలేమీ కాదు. మొత్తంగా బీజేపీకి తిరుగులేదని నిరూపితమయింది. ఇప్పుడేంటి ? భారత ప్రజాస్వామ్యం వర్ధిల్లుతున్నట్లేనా ? ప్రభుత్వం మెరుగైన పాలన అందిస్తున్నట్లేనా ? ప్రజలు తమ హక్కులను కాపాడుకుంటున్నట్లేనా ?. బీజేపీ అప్రహతిహతంగా గెలుస్తున్నంత మాత్రనా ఆ పార్టీ ప్రజలకు జనరంజక పాలన అందిస్తున్నదని… చెప్పలేం కానీ.. గెలుస్తోంది అంటే ప్రజలు ఓట్లేస్తున్నారనే అర్థం. మరి ఇప్పుడు ఏం కావాలి ? లోపాలు దిద్దుకోవడానికి ఏం చేయాలి ? ఇప్పుడు కావాల్సింది ఏమిటి..? .. ఇప్పుడు కావాల్సిందల్లా ఓ బలమైన ప్రతిపక్షం.
బీజేపీకి వ్యతిరేకత ఉందని వేసిన అంచనాలన్నీ తలకిందులు !
భారతీయ జనతా పార్టీ అబేధ్యంగా ఎదుగుతోంది. ఎన్నికల్లో గెలిపించాలన్నా.. ఓడించాలన్నా .. కావాల్సింది రాసే చేతులు.. అరిచే గొంతులు కాదు.. ఈవీఎం మీటలు నొక్కే చేతులు కావాలి. ఆ చిన్న లాజిక్ బీజేపీ వ్యతిరేకులు ప్రతీ సారి మిస్ అవుతుంటారు. ఆ విషయంలో బీజేపీని కొట్టేవాళ్లు ఉండరు. అబద్దాలను ఎదుర్కోవడంలోనూ… అబద్ధాలను చెప్పడంలోనూ బీజేపీ అందరికంటే ముందే ఉంటుంది. అయితే బీజేపీ ఆ ఒక్కపనే…చేయదు. ఎన్నికల్లో ఏం చేయాలో “అన్నీ” చేస్తుంది. రైతుల ఆందోళనలతో.. పశ్చిమ యూపీ మొత్తం బీజేపీకి వ్యతిరేకంగా ఉంటుందన్నారు. యోగీ డవలప్మెంట్ ఏం చేయలేదు.. ప్రజలంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు అన్నారు.. లాక్డౌన్ టైమ్‌లో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన యూపీ కూలీల కన్నీటిగాథలు చూశాక.. ఇక యోగీ ఇంటికే అనుకున్నారు. పెద్ద వాళ్లు కోవిడ్ తో చనిపోయారు. పిల్లలకు ఉద్యోగాలు రాలేదు. ఉన్నవాళ్లకు పనులు లేవు. అంతా నెగటివ్ గా ఉంది. ఇక కచ్చితంగా ఇంటికే అని మేధావులు, విశ్లేషకుల లెక్క. కానీ ఈ లెక్కలేవీ పనిచేయలేదు. యోగి ప్రభుత్వం ఘన విజయం సాధించింది.
వ్యతిరేకత ఉంది కానీ దాన్ని ఓట్లు చేసుకునే పార్టీనే లేదు…
ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను ప్రభుత్వాన్ని ఓడించేంతగా మలచలేకపోవడం ప్రతిపక్షాల వైఫల్యం. తాము ఏం చేస్తున్నామో.. బీజేపీ బలంగా చెబుతుంది. కానీ బీజేపీ లోపాలు ఏంటి.. తాము ఏం చేయగలమో… ప్రతిపక్షాలు.. ఆ యా రాష్ట్రాల్లో బలంగా చెప్పలేవు. సోషల్ మీడియా ట్రోల్స్ లోనూ.. అంతర్జాతీయ వ్యవహారాల్లోనూ బీజేపీని విమర్శిస్తూ ఉంటే… ఊర్లలో ఓట్లు రాలవ్. బీజేపీ బాగా లేదు. మరి బాగా చేయగలిగే వారు ఎవరంట.. అన్న ప్రశ్నకు ఆన్సర్ ఉండదు. అదే బీజేపీ బలం. యూపీలో పోలరైజేషన్ వల్ల ఎస్.పీ కాస్త బలపడిందేమో కానీ.. బీజేపీ మాత్రం వీక్ అవ్వలేదు. యాదవులు, ముస్లింలు కచ్చితంగా ఎస్.పీ వెనుక ఉన్నారు. ఇతర వర్గాల ఓట్లు కూడా పెరిగాయి. మోదీ కంటే.. ప్రజాదరణ ఉన్న నేత ఎవరూ లేరు. ఆయనకు సమీపంలో కూడా ఎవరూ లేరు. బీజేపీకి ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడానికే పెద్ద సైన్యమే ఉంది. అందులో పొలిటికల్ లీడర్ల నుంచి యూత్ ఐకాన్ల వరకూ అందరూ ఉంటారు. సమాజంలో న్యూట్రల్ ఇమేజ్ ఉండి.. ఎక్కువ మందిని ప్రభావితం చేయగలిగిన స్పోర్ట్స్ స్టార్లు, సినిమా యాక్టర్లు, యూత్ ఐకాన్లు ఉంటారు. పోల్ మేనేజ్మెంట్లో పండిపోయిన అమిత్ షా ఉన్నాడు.. ఆనక.. ఆరెస్సెస్ ఉండనే ఉంది. అందుకే బీజేపీని కొట్టడం అంత ఈజీ కాదు. యూపీలోనే చూస్తే.. పబ్లిక్‌లో ఇమేజ్ ఉందనే ఎంపీగా ఉన్న యోగీని తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టారు. మహా సభల నుుంచి.. మైక్రో ఎలక్షనరీంగ్ వరకూ అంత పక్కాగా ఉండబట్టే బీజేపీ అప్రతిహత యాత్ర సాగుతోంది. మొన్న మమత బెంగాల్ లో గర్జించగానే.. బీజేపీ పని అయిపోయిందన్నారు. కానీ నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో తేలిపోయింది.
మోడీకి పోటీగా దేశ్ కీ నేత ఎవరుంటారు ?
ఈ ఎన్నికల రిజల్ట్ ఓ కొత్త విషయాన్ని తెరపైకి తెచ్చాయి. పంజాబ్ లో ఆప్ ప్రభంజనంతో అరవింద్ కేజ్రీవాల్‌ను దేశ్ కీ నేత అంటున్నారు. ఢిల్లీ , పంజాబ్ రెండూ కలిపి కూడా యూపీలో ఓ భాగమంత ఉండవ్. అక్కడ విజయాలను .. అందునా అర్బన్ పాపులేషన్ ఎక్కువుగా ఉన్న ప్రాంతాల్లో గెలిచిన ఆప్ ను చూపి దేశనాయకుడు అంటారా అని కౌంటర్ వాదన చేసే వాళ్లు కూడా ఉన్నారు. దానిని ఓ విధంగా అంగీకరించొచ్చు. ఇప్పటికైతే.. కేజ్రీవాల్ బీజేపీ వ్యతిరేక గొంతుకు కానున్నారు. అయితే.. వాయిస్ బలం ఓట్ల రూపంలో ఏమాత్రం ట్రాన్స్ ఫర్ అవుతుందో ముందు ముందు తేలుతుంది. ఇప్పటికీ మమతా బెనర్జీ ,కేసీఆర్ లాంటి వారున్నారు. కానీ ఇక్కడ తరచి చూస్తే..అందరి ప్రతిపక్ష నేతలే .. కానీ వారికి ఆయా రాష్ట్రాల్లో గుర్తింపు ఉంటుందేమో కానీ.. దేశవ్యాప్తంగా లేదు. అంటే ప్రతిపక్షం లేనట్లే అనుకోవాలి.
బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాల్ని.. వైఫల్యాల్ని ప్రశ్నించేవారేరీ !
యూపీఏ హయాంలో అంటే.. ఏడెనిమిదేళ్ల కిందట.. గ్యాస్ సిలిండర్ ధర రూ. నాలుగు వందల లోపేఉండేది. ఇప్పుడది రూ. వెయ్యి అయింది. పెట్రోల్ రేటు రూ. యాభైకి పైగా పెరిగింది. నోట్ల రద్దు.. లాక్ డౌన్ వంటి నిర్ణయాలతో పేదలు కుంగిపోయారు. మధ్య తరగతి జీవులు నిరుపేదలయ్యారు. కానీ అనుకున్నంతగా ఉపాధి కల్పన లేదు. దేశంలో పురోగతి గొప్పగా ఉందని బీజేపీ నేతలూ చెప్పడం లేదు. కానీ.. ఆ వైఫల్యాల్నీ ప్రశ్నించేవారే లేరు. అంటే ప్రతిపక్షమే లేదు. ప్రభావశీల ప్రతిపక్షం అవసరం ఇప్పుడు మరింతగా పెరిగింది. ఎన్నికల సంఘం, పార్లమెంటు వంటి ప్రజాస్వామిక సంస్థలను నిర్వీర్యం చేయడంలోనూ, రాజకీయ ప్రమాణాలను నిస్సిగ్గుగా ఉల్లంఘించడంలోనూ, రాజ్యాంగ విలువలను ఉపేక్షించడంలోనూ బీజేపీ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు ఉన్నాయి. కానీ ప్రతిపక్షంపై ప్రజలకు ఏమాత్రం నమ్మకం కలగడం లేదు. అందుకే ఎన్నికలలో ఇలాంటి ఫలితాలు వస్తున్నాయి.
తమలో తము యుద్ధం చేసుకుంటున్న ప్రతిపక్షం !
ప్రజాస్వామ్యంలో దేశానికి నాయకత్వం వహించకపోగా ప్రతిపక్షం తనతో తానే యుద్ధం చేసుకుంటోంది! తృణమూల్ కాంగ్రెస్ గోవా , ఈశాన్యభారతం, ఇంకా ఇతర రాష్ట్రాలలో కాంగ్రెస్‌పై అప్రకటిత యుద్ధం చేస్తోంది. పంజాబ్ లో కాంగ్రెస్‌ను అధికారం నుంచి ఆమ్ఆద్మీ పార్టీ కూలదోసింది. యూపీలో ఎస్పీ కాంగ్రెస్‌కు చోటు లేకుడా చేసింది. ప్రతిపక్షాల మధ్య ప్రస్తుత ఆధికక్యతా పోరు దేశ శ్రేయస్సుకు మంచిది కాదు. విశాల జాతీయ ప్రయోజనాలకు అనుకూలంగా తమ స్వప్రయోజనాలను వదులుకునేందుకు ప్రాంతీయ పార్టీలు సిద్ధంగా లేవ. వివిధ ప్రతిపక్షాల మధ్య జగడాలు, కాంగ్రెస్‌లో అంతర్గత కొట్లాటలు ప్రజలను నిరాశా నిస్పృహలకు గురి చేస్తున్నాయి. మోదీ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రజలకు వివరించి రాజకీయ లబ్ధిని పొందే సంకల్పం ప్రతిపక్షాలలో కొరవడడం విస్మయం కలిగిస్తోంది. అసలు ప్రతిపక్షాలుగా వాటి విశ్వసనీయతే ప్రశ్నార్థకమవుతోంది. ఫలితంగా బీజేపీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా సునాయాసంగా విజయం సాధిస్తోంది.
బీజేపీ అజేయశక్తి కాదు.. !
ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ కూడా అజేయశక్తి కాదు. ప్రతిపక్షం అంటే కేవలం ఒక విపక్షంగా వ్యవహరించడం మాత్రమే కాదని, పరిపూర్ణ ఆశాభావాన్ని కలిగించి , సుసాధ్యమయ్యే ప్రత్యామ్నాయాలను ప్రతిపాదించగల శక్తి అనే దార్శనికతను ఇవ్వగలుగుతుంది. మన సమున్నత ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యాన్ని కాపాడుకునేందుకు ఇంకా రెండేళ్ల వ్యవధి ఉన్నదని గుర్తు చేస్తోంది. “ప్రతిపక్షం” అనేది ఒక మహోన్నతమైన బాధ్యత. Eఆ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించగలిగే పార్టీ లేదా నాయకుడు ఇప్పుడు కావాలి. ఆ నాయకుడు ఎప్పుడు వస్తే.., బీజేపీకి అప్పుడు అసలైన ప్రతిపక్షం లభించిటనట్లవుతుంది. పాలనపై బీజేపీలో భయభక్తులు కూడా అప్పుడే ప్రారంభమవుతాయి. ఆ ప్రత్యామ్నాయం లభించే వరకూ… ఎన్నికల కౌంటింగ్ జరిగిన ప్రతీ సారి వికసించిన కమలం అనే హెడ్‌లైన్స్ ను చదువుకుంటూ ఉండాలి.