ఎన్నికలకు ముందు ఢిల్లీలో ఈసీ ఆఫీసు ముందు జగన్మోహన్ రెడ్డి చేసిన ఓ ప్రకటన ఏపీలో రాజకీయ సంచలనం అయింది. డీఎస్పీ ప్రమోషన్లలో అందరూ కమ్మవారికే ఇచ్చారని ఆయన ఆరోపించారు. ఆ ప్రకటన చేసిన కాసేపట్లోనే వైసీపీ సోషల్ మీడియా విస్తృత ప్రచారం చేసింది. అంతా కమ్మ రాజ్యం అని హోరెత్తించారు. టీడీపీ ఖండించింది. అధికారంలో ఉండి.. చేసిన ఆ ఖండన చాలా పీలగా ఉంది. ఎవరూ నమ్మలేదు. వైసీపీ నేతలు.. సోషల్ మీడియా చేసిన ప్రచారం ప్రజల్లోకి వెళ్లిపోయింది. ఆ తప్పుడు ప్రచారం టీడీపీపై ఎంత ఎఫెక్ట్ పడిందో చెప్పాల్సిన పనిలేదు.
ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు ప్రభుత్వమే ఇచ్చిన ఓ సమాధానాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ .. దేవుడి స్క్రిప్ట్ అంటూ విమర్శలు చేస్తున్నారు. జగన్ తప్పుడు ప్రచారం చేశారని క్షమామపణలు చెప్పాలని అంటున్నారు. దీన్ని చూసి వైసీపీ నేతలు నవ్వుకుంటూ ఉండవచ్చు. ఎందుకంటే ఆ సమాచారాన్ని ఇవ్వకూడదనుకుంటే… వైసీపీ ఇచ్చేది కాదు. ఇవ్వాలనుకుంది .. ఇచ్చింది. కానీ అధికారంలో ఉన్నప్పుడు.. జగన్ ఇలాంటి ఆరోపణలు చేస్తే.. ఇలాంటి సమాచారం అధికారికంగా ఎందుకు ఇవ్వలేకపోయింంది ? వైసీపీ, జగన్ తప్పుడు ప్రచారాన్ని ఎందుకు అప్పుడే ఆధారాలతో ఆపలేకపోయింది ? తప్పుడు ప్రచారం చేసిన జగన్పై ఎందుకు పోలీసు ప్రతిష్టను మంటగలుపుతున్న కారణంగా కేసులు పెట్టలేకపోయింది ? ఇవన్నీ అధికారంలో ఉండి కూడా టీడీపీ చేయలేకపోయిన చేతకానికి తనానినికి నిదర్శనాలే.
అదే ఇప్పుడు నిజంగానే మొత్తం రెడ్డి సామాజికవర్గానికిపదవులు ఇస్తున్నా.. నిజం గట్టిగా చెప్పలేని పరిస్థితుల్లో టీడీపీ ఉంది. అదే వైసీపీ స్థాయిలో తప్పుడు ప్రచారం చేస్తే.. ఇక టీడీపీ నేతల పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం. ఇప్పుడునిజం బయటకు వచ్చిందని టీడీపీ సంబర పడుతోంది.. జగన్ అబద్దాలు చెప్పారని అంటోంది.. కానీ ఈ విషయాన్ని చేతులు కాలిన తర్వాత నిరూపించాలని టీడీపీ అనుంటోంది. కొసమెరుపేమిటంటే.. ఈ నిజాన్ని కూడా వైసీపీనే బయటపెట్టింది. ఇలాంటి చేతకాని రాజకీయాల్నే టీడీపీ వదులుకుని దూకుడుగా వెళ్తేనే ఫేక్ ప్రచారాలకు బలి కాకుండా ఉంటారు.. లేకపోతే అంతే !