వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం సమావేశంలో .. పార్టీ అనుబంధ విభాగాలకు ఇంచార్జిగా నియమితులైన విజయసాయిరెడ్డి క్లిష్ట పరిస్థితి ఎదుర్కొన్నారు. అధికారంలో ఉండికూడా కేసుల పాలైన కార్యకర్తలను అదుకోవడం లేదని కొంతమంది ఫైరయ్యారు. కనీసం న్యాయసహాయం కూడా చేయడం లేదని.. చివరికి ఎలాగోలా బెయిల్ తెచ్చుకున్నా.. జామీన్ ఇచ్చేందుకు కూడా వైసీపీ నుంచి ఎవరూ రాలేదని కొంత మందికి ఎదురయిన అనుభవాలను ప్రస్తావించడంతో విజయసాయిరెడ్డి ఇబ్బంది పడ్డారు. కేసులు పాలయ్యే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల్ని ఆదుకునేందుకు ప్రత్యేకంగా లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చారు.
వైసీపీ ఆఫీసు నుంచి వచ్చే కంటెంట్‌తోనే సోషల్ మీడియా కార్యకర్తలు పోస్టులు చేస్తున్నారు. కానీ వారు ఇప్పుడు కేసుల్లో ఇరుక్కుంటున్నారు. సహజంగా రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి కేసులనే మాటలు ఉండకూడదు. కానీ కోర్టులపై వ్యాఖ్యలు చేయడంతో పరిస్థితి మారిపోయింది. ఎంతో మంది అరెస్టయ్యారు. మరెంతో మంది అరెస్టు ముప్పులో ఉన్నారు. వారికి సాయం చేస్తే తమపైకి ఎక్కడ వస్తుందోనని విజయసాయిరెడ్డి, గుర్రం పాటి దేవేందర్ రెడ్డి పట్టించుకోలేదు. చివరికి చాలా రోజుల తర్వాత బెయిలొచ్చినా… వారికి జామీన్ ఇచ్చేందుకు వైసీపీ నేతలు ముందుకు లేదు.
సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా ఉంటామని వైసీపీ నేతలు ప్రకటించారు. కానీ.. వారికి న్యాయసాయం అందిస్తే.. వారి వెనుక తాము ఉన్నామన్న భావన పెరిగిపోతుందని.. అది మంచిది కాదని అనుకున్నారు. వారిని వదిలేశారు. వారికి సాయం చేసేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయదు. ఈ కారణంగా పార్టీపై వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు విశ్వాసం కోల్పోయే పరిస్థిత ఏర్పడింది. అందుకే ప్రత్యేకంగా సమావేశం పెట్టిన విజయసాయిరెడ్డి లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే.. ఇప్పుడు అధికారంలోనే ఉంటే పరిస్థితి ఇలా ఉంది..అధికారం పోతే.. తమను ఉపేక్షించరని ఎక్కువ మంది భయపడుతున్నారు.