Radhe Shyam Review
తెలుగు360 రేటింగ్ 2.5/5
ప్రభాస్ అంటే… మినిమం మూడొందల కోట్లు పెట్టాల్సిందే అని ఫిక్సయిపోయింది టాలీవుడ్. అందుకే చారాణా కథనీ, చింపి చాటంత చేసి, పాన్ ఇండియా లుక్కు తీసుకురావడానికి శత విధాలా ప్రయత్నిస్తున్నారు. `విధిని ఎదిరించి గెలిచిన ప్రేమకథ` అనే ఓ చిన్న పాయింట్ ని పట్టుకుని, ప్రభాస్ ని పెట్టుకుని, కోట్లాది రూపాయల సెట్లు వేసుకుని, స్టార్లని వెంటేసుకుని, ఫారెన్ లొకేషన్లు చుట్టేసుకుని – దాన్ని రూ.300 కోట్ల సినిమాగా మలచడానికి నానా తంటాలు పడింది చిత్రబృందం… అదే రాధే శ్యామ్. మూడేళ్లుగా చిత్రీకరణ జరుపుకుంటూనే ఉన్న ఈసినిమాకి ఎట్టకేలకు మోక్షం లభించింది. మరి.. రాధేశ్యామ్ జాతకం ఎలా ఉంది? ఆ రూ.300 కోట్లు తెరపై కనిపించాయా, లేదా?
విక్రమ్ ఆదిత్య (ప్రభాస్) హస్త సాముద్రికంలో నిష్టాతుడు. తను చేయి చూసి జాతకం చెప్పాడంటే జరిగి తీరుతుందంతే. తన కోసం దేశాధినేతలు కూడా ఎదురు చూస్తుంటారు. ఇండియాలో ఎమర్జెన్సీ వస్తుందని ముందే చెప్పేసి, యూరప్ వెళ్లిపోతాడు. అక్కడ ప్రేరణ (పూజా హెగ్డే) పరిచయం అవుతుంది. తానో డాక్టర్. తనపై విక్రమ్ ఆదిత్యకు ఇష్టం ఏర్పడుతుంది. కానీ.. తన చేతిలో ప్రేమ గీత లేదని విక్రమ్ కి తెలుసు. అందుకే కొన్నాళ్లు కలిసి బతుకుదాం.. అని ప్రేరణని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. జీవితం – ప్రేమలపై స్పష్టమైన అవగాహన ఉన్న ప్రేరణ.. విక్రమ్ ప్రపోజల్‌కు ఒప్పుకుందా? ప్రేరణ కథేమిటి? తన జీవితంలో ప్రేమేలేదని నమ్మిక విక్రమ్… తనకు జీవితమే లేదని అనుకున్న ప్రేరణ.. వీరిద్దరినీ విధి కలిపిందా, విడదీసిందా? అనేదే మిగిలిన కథ.
విధికీ ప్రేమకీ మధ్య జరిగిన యుద్ధం – అంటూ ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పేసింది చిత్రబృందం. అంతకు మించిన కథ కూడా ఏం లేదు. ఆ చిన్న లైన్ ని పట్టుకుని రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను కూర్చోబెడదాం అని దర్శక నిర్మాతలు ఎలా అనుకున్నారో అర్థం కాదు. సినిమాలో ప్రభాస్ ఉన్నాడు, పూజా ఉంది, బోల్దెంత బడ్జెట్ ఉంది.. అవి చాల్లే అనుకుని ఉంటారు. నిజానికి ఇది యూరప్‌లో తీయాల్సిన కథ కాదు. అంత డిమాండ్ కూడా చేయలేదు. కేవలం ఓ ఫ్రెష్ నెస్ కోసం యూరప్ లో ఈ కథ చెప్పారేమో అనిపిస్తుందంతే. ఇండియాలోని ఏ హిల్ స్టేషన్ నేపథ్యంలో తీసినా.. ఈ కథ ఇలానే ఉండేది. ప్రభాస్ ఓ స్టార్ హీరో. అంతకంటే మాస్ హీరో. తన నుంచి ఆశించే అంశాలేం ఈ కథలో కనిపించవు. అది పెద్ద మైనస్ గా మారిపోయింది. ప్రభాస్ నాలుగు మాస్ డైలాగులు చెప్తే విందాం, ఓ ఫైట్ చేస్తే చూద్దాం అనుకునే వాళ్లు ఈ సినిమాకి దూరంగా ఉండడమే బెటరేమో..?
రాధేశ్యామ్ కథ. చాలా స్లోగా మొదలవుతుంది. సినిమా సాగుతున్న కొద్దీ… వేగం పెరగాల్సింది పోయి తగ్గుతూ ఉంటుంది. హీరోని హస్త సాముద్రిక నిపుణుడిగా పరిచయం చేశారు. ఇలాంటి నేపథ్యంలో సినిమా రాలేదు కాబట్టి, ఆ ఒకట్రెండు సీన్లు ఆసక్తిగానే ఉంటాయి. మరి ఆ తరవాత పరిస్థితి ఏమిటి? వెంటనే ప్రేమ కథ మొదలెట్టేయాలి. అది జరిగినా… ఆ ప్రేమకథలో సోల్ లేకపోవడం, విక్రమాదిత్య – ప్రేరణ మధ్య సాగే సన్నివేశాల్లో డెప్త్ కనిపించకపోవడంతో ప్రేమకథ వెండి తెరపై రక్తి కట్టలేదు. `డెత్ ప్రాక్టీస్` అనే సీన్ సుదీర్ఘంగా సాగి బోర్ కొట్టిస్తుంది. తెరపై స్టార్లంతా అలా వచ్చిపోతుంటారు. ఏ పాత్రకీ సరైన ప్రాధాన్యం లేదు. రెండంటే రెండు సీన్ల కోసం, అది కూడా విక్రమాదిత్య హస్త సాముద్రిక నైపుణ్యం ఏమిటో చెప్పడానికి.. జగపతిబాబుని వాడుకున్నారు. ప్రభాస్ తల్లి పాత్రలో భాగ్యశ్రీ అనగానే.. ఆ పాత్రకు ఏమాత్రం ప్రాధాన్యం ఉందో అని జనాలంతా ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ.. ఆ పాత్ర భాగ్యశ్రీ చేసినా ఒక్కటే మన హేమ చేసినా ఒక్కటే అన్నట్టు తయారైంది. భాగ్యశ్రీని తీసుకున్నందుకైనా తల్లీ కొడుకుల మధ్య ఒక్క ఎమోషన్ సీన్ అయినా పెట్టాల్సింది. ఈ సినిమాలో మురళీ శర్మ అనే నటుడు ఉన్నాడన్న విషయం చాలా జాగ్రత్తగా గమనిస్తే గానీ తెలీదు. పాసింగ్ క్రౌడ్ లాంటి పాత్రల కోసం పెద్ద పెద్ద వాళ్లనే పెట్టారు. ఇదంతా బడ్జెట్ పెంచుకోవడానికి తప్ప, కథలో డెప్త్ ని తీసుకురావడానికి ఉపయోగపడలేదు.
చివర్లో షిప్ సీన్ గురించి చాలా ప్రచారం జరిగింది. చాలామంది ఆ సీన్‌ని, ఆ సీన్ వల్ల ఈసినిమానీ టైటానిక్‌తో పోల్చారు. కానీ.. అది కూడా ఇరికించిన సన్నివేశంలానే ఉంటుంది. ఈ సినిమాలో ప్రతీ చోటా.. ఖర్చు కనిపించింది. ప్రతీ సెట్టూ లావీష్ గాఉండడంతో.. `ఇంత అయ్యుంటుందేమో` అనిపిస్తుంది. కొన్ని చోట్ల.. మరీ సెట్లు ఎక్కువైపోయాయి అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. కేవలం సెట్ల కోసమే ఈ సినిమా తీశారా..? అనిపిస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ కొన్ని చోట్ల తేలిపోయాయి. సీజీలో తీసిన సీనేంటో కూడా పసిగట్టేయొచ్చు.
ప్రభాస్ బలాల్ని పక్కన పెట్టి, తనని గీతాంజలి టైపు కథలో ఇమిడిద్దామని చేసిన ప్రయత్నం ఇది. ప్రభాస్ చాలా చోట్ల ఒళ్లు చేసినట్టు కనిపించాడు. కొన్ని డైలాగులు మరీ బొంగురు గొంతుతో వినిపించాయి. కొన్ని చోట్ల అందంగా ఉన్నా, ఇంకొన్ని చోట్ల మాత్రం `ప్రభాస్ ఇలా అయిపోయాడేంటి` అనిపిస్తుంది. తన స్టైలింగ్ బాగుంది. పూజా హెగ్డే మరోసారి కనికట్టు చేసింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ పండేంతంగా సీన్లు రాసుకోలేకపోయాడు దర్శకుడు. కృష్ణంరాజు వయసుకి తగిన పాత్ర చేశారు. ఆయన సీన్లు పరిమితమే అయినా జాతకానికీ, నమ్మకానికీ మధ్య ఉన్న స్పష్టమైన తేడాని ఆయన పాత్రతో చెప్పించాడు దర్శకుడు. అయితే విచిత్రం ఏమిటంటే… విదేశీ ప్రింటులో మాత్రం కృష్ణంరాజు పాత్రని… సత్యరాజ్ పోషించారు. అదేం లాజిక్కో మరి..?! కొంతమంది గెటప్పులు, మీసకట్టులు చాలా విచిత్రంగా కనిపించాయి. ముఖ్యంగా.. మురళీ శర్మ. తను ఓ డైలాగ్ చెబితే గానీ, `ఈయన మురళీ శర్మ` అనేది అర్థం అవ్వదు. ప్రియదర్శన్ ఉన్నా.. నవ్వించలేకపోయాడు.
టెక్నికల్ గా ఈ సినిమా హై స్టాండర్డ్ లో ఉంది. అయితే.. పాటలు మైనస్. సినిమానే స్లో అనుకుంటే, పాటలు మరింత స్లోగా సాగాయి. యూరప్ లొకేషన్లని హైదరాబాద్ లో మ్యాచ్ చేయడం అంత ఈజీ కాదు. ఈ విషయంలో ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ పనితనం మెచ్చుకోవాల్సిందే. ప్రతీ సీనులోనూ, ప్రతీ షాటులోనూ.. కళారంగ పనితీరు కనిపిస్తుంది. దర్శకుడు రాధాకృష్ణ చాలా సింపుల్ కథ పట్టుకుని, స్టార్లని నమ్ముకుని రంగంలోకి దిగాడు. అయితే ఓ మంచి కథకి స్టార్ బలం అవ్వగలడు కానీ, కథేలేని చోట, అందులో సంఘర్షణ కరువైన చోట, ఏ స్టారూ.. ఆ కథని కాపాడలేడు. ఎన్ని కోట్లు పోసినా… దాన్ని నిలబెట్టలేరు. దానికి రాధే శ్యామ్ నిదర్శనం.
ఫినిషింగ్ టచ్: `హిట్` రేఖ లేదు
తెలుగు360 రేటింగ్ 2.5/5