టీఆర్ఎస్ నేతలు తమ అనుచరులతో భేటీలు అవుతూండటం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం దొరకదని భావిస్తున్న వారు.. తమ భవిష్యత్ కార్యాచరణ కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వారికి బీజేపీ రూపంలో మంచి ఆప్షన్ ఎదురుగా ఉండటంతో త్వరపడాలనుకుంటున్నారు. ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ప్రచారం కారణంగా ఇప్పుడు అందరూ రెడీ పోతున్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జూపల్లి కృష్ణారావును టీఆర్ఎస్ పక్కన పెట్టింది. గత ముందస్తు ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఆయన పై గెలచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను టీఆర్ఎస్లో చేర్చుకున్నారు. ఆయన గ్రూపుల్ని ప్రోత్సహించారన్న కారణంగా ఆయనను పక్కన పెట్టారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆయన పార్టీ అభ్యర్థులను కాకుండా సొంత వారిని నిలబెట్టి గెలిపించుకున్నారు. అయితే అధికార పార్టీ నుంచి ఆయన బయటకు వెళ్లలేదు. వచ్చే ఎన్నికల్లో పోటీకి కూడా అవకాశం దక్కతుందని అనుకోవడం లేదు. అందుకే ఆయన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెబుతున్నారు. బీజేపీలో చేరే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. అయితే బీజేపీలో ఇప్పటికే ఆయన ప్రత్యర్థి డీకే అరుణ ఉన్నారు. అది సాధ్యమా అని చర్చలు జరుగుతున్నాయి.
ఇక ఖమ్మం జిల్లాలో సీనియర్లు.. తాము వెనక ఉన్నా.. తమ అనుచరులతో సమావేశాలు పెట్టిస్తున్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు పోటీ చేసే అవకాశం రావడం కష్టమేనని తేలిపోయింది. ఇప్పటికీ హైకమాండ్ నుంచి ఎలాంటి సూచనలు రాలేదు. దాంతో ఆయన ఓడిపోయిన పాలేరులో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉపేంద్ర రెడ్డిని టీఆర్ఎస్లో చేర్చుకున్నారు. దీంతో తుమ్మల భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని ఆయన అనుచరులుడిమాండ్ చేస్తున్నారు. అచ్చంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డిది కూడా అదే పరిస్థితి. ఆయన కూడా పార్టీ మార్పుపై సంకేతాలిస్తున్నారు.
పోటీ చేయడానికి అవకాశం దక్కని నేతలు పార్టీ మారడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అందుకే టీఆర్ఎస్ హైకమాండ్‌కు సంకేతాలు పంపుతున్నారు. వీరిని ఎలా బుజ్జగిస్తుందనేదానిపై టీఆర్ఎస్ పరిస్థితి ఆధారపడి ఉంటుదంని అనుకోవచ్చు.