చిన్న సినిమాతో దర్శకుడిగా ప్రయాణం మొదలెట్టారు శ్రీకాంత్ అడ్డాల. తొలి సినిమా హిట్టవ్వడంతో.. ఇద్దరు హీరోలతో మల్టీస్టారర్ చేసే స్థాయికి ఎదిగారు. మహేష్‌తో `బ్రహ్మోత్సవం` ఆయన్ని బాగా నిరాశ పరిచింది. కెరీర్ ని గందరగోళ స్థితిలో పడేసింది. `నారప్ప` కూడా ఆయనకు కలిసి రాలేదు. అందుకే ఇప్పుడు బ్యాక్ టూ రూట్స్ అనుకుంటూ ఓ చిన్న సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
`అఖండ` సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి. ఆయన తనయుడ్ని హీరోగా పరిచయం చేయాలనుకుంటున్నారు. అందుకు రంగం సిద్ధమైంది. తన కొడుకుని హీరోగా చేసే బాధ్యత శ్రీకాంత్ అడ్డాల చేతిలో పెట్టారు రవీందర్ రెడ్డి. ప్రస్తుతం శ్రీకాంత్ ఓ పవర్ ఫుల్ ప్రేమకథని తయారు చేసే పనిలో ఉన్నాడని టాక్. కథ రెడీ అవ్వగానే, తన కొత్త సినిమా మొదలెడతారు. శ్రీకాంత్ అడ్డాల దగ్గర `అన్నాయ్` అనే మరో కథ ఉంది. దానికి ఇద్దరు హీరోలు అవసరం. ఇద్దరూ స్టార్ హీరోలే కావాలి. గీతా ఆర్ట్స్ ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చింది. అయితే దర్శకుడిగా ఓ హిట్ కొట్టాకే, మళ్లీ మల్టీస్టారర్ జోలికి వెళ్లాలని శ్రీకాంత్ భావిస్తున్నాడట. అందుకే ఇప్పుడు అర్జెంటుగా ఈ ప్రాజెక్టుని పట్టాలెక్కిద్దామని డిసైడ్ అయ్యారు.