పాన్-ఇండియా సినిమా ‘రాధేశ్యామ్’ విడుదలైయింది. సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. రివ్యూలు కూడా సినిమాలో లోపాలని ఏకరవు పెట్టాయి. ఎంత ఖర్చుతో తీస్తే ఏం లాభం ? సినిమాలో ఎమోషనల్ కనెక్షన్ లేదని, అసలు ఆ మాత్రం కథ చెప్పడానికి ప్రభాస్ లాంటి స్టార్, అంత సెటప్ ఎందుకని విశ్లేషణలు ఇచ్చారు. అటు బాలీవుడ్ జనాలకు కూడా సినిమా పెద్దగా నచ్చలేదు. ప్రతి సినిమాని బిజినెస్ లా చూసి ఆచితూచి స్పందించే తరణ్ ఆదర్శ్ లాంటి ట్రేడ్ ఎనలిస్టులు కూడా సినిమా అస్సల్ బాలేదని తీర్మానం చేసేశారు.
అయితే బాలీవుడ్ లో రాధేశ్యామ్ పై నెగిటివ్ టాక్ ఇక్కడితో ఆగలేదు. ప్రభాస్ వయసుని ఎత్తిచూపే వరకూ వచ్చింది. ప్రముఖ రచయిత్రి, ఫిల్మ్ క్రిటిక్ అనుపమ్ చోప్రా రాధేశ్యామ్ ని రివ్యూ చేసింది. ఆమె రివ్యూ చాలా పర్శనల్ లెవల్ లోకి వెళ్ళింది. రాధేశ్యామ్ లో అలనాటి హీరోయిన్ భాగ్యశ్రీని ప్రభాస్ తల్లిగా కనిపించిన సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ అనుమపకి నచ్చలేదు. ”42 ఏళ్ల వయసున్న ప్రభాస్ కి 52 ఏళ్ల భాగ్యశ్రీని తల్లిగా పెట్టుకోవడం ఏంటి? అని ప్రశ్నించింది. కాస్త వయసు చూసుకోవాలి కదా? అని సలహా కూడా ఇచ్చింది. అనుమప రివ్యూని చూసి మిగతా కొన్ని హిందీ ఛానల్స్ కూడా ఇదే పాయింట్ లేవనెత్తాయి. భాగ్యశ్రీ, ప్రభాస్ కి చెల్లిలా వుందని కొంత వ్యంగ్యాన్ని జోడించాయి.
అలనాటి తరాలని తల్లి పాత్రలో నటింపచేయడం సహజంగానే జరుగుతుంటుంది. కానీ అనుపమ మాత్రం అదేదో అసహజమైన ఎంపిక అన్నట్లు రివ్యూ చేయడం అంత సమంజసంగా లేదు. బాలీవుడ్ కి చెందిన భాగ్యశ్రీకి అక్కడ వాళ్ళకు అభిమానం వుండొచ్చు. కానీ ఆ అభిమానాన్ని చూపించే పద్దతి మాత్రం ఇది కాదు. నటనకు వయసుతో పనిలేదనే సంగతి పరిశ్రమలో తలపండిన అనుపమకు చెప్పాల్సిన పనిలేదు.