వైసీపీ ఏర్పాటు చేసి పన్నెండేళ్లవుతోంది. 2011లో ఇదే రోజున జగన్ సోనియాగాంధీపై తిరుగుబాటు చేసి సొంత పార్టీ ప్రకటించుకున్నారు. ఆ తర్వాత జగన్ పోరాట పటిమ ప్రదర్శించారు. జనంలోనే ఉన్నారు. నిజానికి ఆయన పార్టీ పెట్టినప్పుడు ఉమ్మడి రాష్ట్రం. తెలంగాణ ఉద్యమం బలంగా ఉంది. అయినప్పటికీ సానుభూతి కారణంగా ఆదిలాబాద్ నుంచి చిత్తూరు వరకూ ఆయన హవా ఎక్కువగా ఉండేది. కానీ రాను రాను మొత్తం కరిగిపోయింది. చివరికి అది గెలుస్తామనుకున్న 2014 ఎన్నికల్లో ఓటమికి దారి తీసింది.
అయినా జగన్ వెనక్కి తగ్గకుండా జనంలోనే ఉండి.. పాదయాత్ర చేసి.. వారం వారం కోర్టుకెళ్లాల్సిన పరిస్థితుల్లోనూ తన పోరాటం కొనసాగించి ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించారు. టీడీపీ పాలనపై కుల ముద్ర వేసినా… పీకే వ్యూహాలతో చేసినా.. విజయం విజయమే కాబట్టి జగన్ అనుకున్నది సాధించారు. అప్పటి వరకూ వైసీపీలో ఓ రకమైన ఉత్సాహం ఉండేది. అధికారంలోకి వస్తామనే ఆశ కనిపిస్తూ ఉండేది. తీరా అధికారంలోకి వచ్చిన కొత్తలోనూ వైసీపీలో అదే ఉత్సాహం ఉండేది. మూడేళ్ల తర్వాత ఇప్పుడు పార్టీ కార్యాలయాల్లో జెండాలు ఎగరేసి స్వీట్లు పంచుకుని.. చంద్రబాబును , టీడీపీని విమర్శించి ఎవరి దారిన వాళ్లు పోవడం తప్ప.. ఇంకెలాంటి ఉత్సాహం కనిపించడం లేదు.
ఏ చిన్న పండుగ వచ్చినా జగన్కు శుభాకాంక్షలు చెబుతూ ఫ్లెక్సీలు.. పోస్టర్లు.. పేపర్లో ప్రకటనలు వెల్లువెత్తేవి. అలాంటిది … ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నా ఎవరూ అలాంటి ఖర్చులు పెట్టుకోలేదు. వైసీపీ క్యాడర్ కూడా పెద్ద ఎత్తున బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వారెవరూ ఖర్చు పెట్టుకునే పరిస్థితుల్లో లేరు. ఆర్థికంగా బలపడతామనుకున్న వారు ఇప్పుడు చితికిపోయే పరిస్థితి వచ్చింది. పెద్ద నేతలు.. మంత్రులు.. వ్యాపారవేత్తల నేతలు మాత్రం పెద్ద పెద్ద ఈవెంట్లు జరిగిప్పుడు ఖర్చు పెట్టుకుటున్నారు. ఈ పరిస్థితిపై వైసీపీ నేతలు సమీక్ష చేసుకోవాల్సి ఉంది.