పంజాబ్ మినహా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడంతో తెలంగాణ బీజేపీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. హిందీ బెల్ట్‌లో అజేయ స్థితికి చేరిన బీజేపీ ఇప్పుడు కొరకరాని కొయ్యగా మారిన దక్షిణాదిపై చూసే అవకాశం కనిపిస్తోంది. దక్షిణాదిలో బీజేపీ అధికారం చేపట్టబోయే రెండో రాష్ట్రం తెలంగాణ అని ఆ పార్టీ హైకమాండ్ చాలా నమ్మకంతో ఉంది . ఈ సారి ఎన్నికల్లో గెలిచేది తామేనని.. సర్కార్ ను ఏర్పాటు చేయడం పక్కా అని రాష్ట్ర బీజేపీ నేతలు భావిస్తున్నారు.
ఒక్కొక్క రాష్ట్రంలో పార్టీని విస్తరించుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇప్పుడు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్న తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకుని అధికారం సాధిస్తే.. ఇతర రాష్ట్రాలకూ విస్తరించవచ్చని భావిస్తున్నారు. ఈ క్రమంలో అమిత్ షా త్వరలో తెలంగాణ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది. డబుల్ ఇంజిన్ ఫార్ములాను బీజేపీ నేతలు ప్రధానంగా ప్రయోగించాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. కేంద్రంలో ఉన్న ప్రభుత్వమే రాష్ట్రాల్లోనూ ఉంటేనే అభివృద్ధి సాధ్యం నినాదంతో ప్రజల్లోకి వెళ్ళాలని భావిస్తున్నారు.
ఇక పూర్తి ఫోకస్ దక్షిణాదిపైనే పెట్టాలని, అందులోనూ తెలంగాణనే టార్గెట్ చేయాలని హైకమాండ్ ప్రణాళికలు చేస్తోంది. బెంగాల్ తరహాలో పార్టీలో చేరికలపై ఇప్పటికే దృష్టి సారించారు. అందుకే టీఆర్ఎస్లో ఆదరణ దక్కని సీనియర్ల పేర్లు విస్తృతంగా ప్రచారంలోకి వస్తున్నాయి. త్వరలో తెలంగాణకు జాతీయ నేతలు, కేంద్ర మంత్రుల పర్యటనలు ఉండనున్నాయి. బెంగాల్ తరహా వ్యూహాలను.. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత అమలు చేసే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు.