ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసేందుకు గాంధీ ఫ్యామిలీ సిద్ధమైనట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఖండిస్తున్నప్పటికీ.. ఇప్పటికే గాంధీ ఫ్యామిలీ ఓ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఇటీవలి కాలంలో ప్రతీ దానికి గాంధీ కుటుంబాన్ని నిందించడం ఆనవాయితీగా మారిపోయింది. అదే సమయంలో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. ఈ క్రమంలో రాజకీయాల నుంచి వైదొలగడమే మంచిదన్న భావనకు వచ్చినట్లుగా చెబుతున్నారు.
రాహుల్ గాంధీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని వదిలేశారు. మళ్లీ తీసుకోవడానికి ఆయన అంగీకరించడం లేదు. సోనియా గాంధీనే అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఇటీవల ఉపఎన్నికల్లో ప్రియాంకా గాంధీ కూడా కష్టపడ్డారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఈ క్రమంలో పార్టీలోకొంత మంది సీనియర్లు జీ -23 పేరుతో అంతర్గత కలహాలు ప్రారంభించారు. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్ పార్టీని మరింత గందరగోళంలోకి నెడుతున్నాయి. ఇక ఇవన్నీ ఎందుకని.. గాంధీ ఫ్యామిలీ రాజీనామాలు ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.
పార్టీలో ఉన్న సీనియర్.. జూనియర్ నేతలు పార్టీ కోసం పని చేస్తున్నట్లుగా ఉండటం లేదు. సొతం వర్గం కోసం పని చేస్తున్నట్లుగా ఉంటున్నారు. అంతో ఇంతో బలంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి. ఈ కారణంగా గెలవాల్సిన చోట కూడా ఓడిపోతున్నారు. వీటిని సరి చేయడానికి గాంధీలు చెప్పే సలహాల్ని.. సూచనల్ని సీనియర్లు పాటించడం మానేశారు. అయితే ఇంత దానికే గాంధీలు రాజీనామా చేయరని కొంత మంది అంటున్నారు.
నిజానికి గాంధీ ఫ్యామిలీ లేకుండా కాంగ్రెస్ పార్టీని ఊహించలేం. వారు పార్టీకి పిల్లర్లులా ఉంటారు. వారు లేకపోతే బీజేపీ చెబుతున్న కాంగ్రెస్ ముక్త్ భారత్కు మార్గం సుగమం అయినట్లేనని చెప్పుకోవచ్చంటున్నారు. అయితే గతంలోనూ ఇలాంటి రాజీనామా ల ప్రకటనలు వచ్చినా… పార్టీ నేతలు ధర్నాలు.. నిరసనలు చేసి.. వారినే కొనసాగాలని ఒత్తిడి చేశారని.. అలాంటివే ఇప్పుడూ జరుగుతాయని .. వారు కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లోనే ఉంటారని అంచనా వేస్తున్నారు.