వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిన్న కడప జిల్లాలో ఆలంఖాన్ పల్లె వద్ద కడప నగరపాలక సంస్థ కార్పోరేటర్లను ఉద్దేశ్యించి మాట్లాడుతూ “ఇన్నేళ్ళుగా మీరందరూ మా కుటుంబానికి అండగా ఉన్నారు. మరో రెండేళ్ళు నాతో కలిసి పోరాటం చేస్తే తరువాత రాష్ట్రంలో మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. అప్పుడు మాకు సహాయపడిన ప్రతీ ఒక్కరి రుణం తీర్చుకొంటాను. మీరందరూ జిల్లాలో నాకు అండగా నిలబడుతామని మాటిస్తే నేను వేరే జిల్లాలలో పార్టీని బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టగలను. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలలో పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత కారణంగా ప్రభుత్వాధికారులలో, పోలీసులలో కూడా మార్పు వస్తుంది. అప్పుడు వాళ్ళు కూడా మన మాటే వింటారు.”
సరిగ్గా వారం రోజుల క్రితం ‘గంటలో తెదేపా ప్రభుత్వాన్ని పడగొడతానని’ ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తన స్వంత జిల్లాలోనే తన పార్టీ నేతలని, కార్పోరేటర్లని పార్టీ విడిచిపెట్టి వెళ్లి పోవద్దని ఈవిధంగా బ్రతిమాలుకోవడం, తనకు అండగా నిలబడితే తాను అధికారంలోకి వచ్చిన తరువాత అందరి రుణం తీర్చుకొంటానని చెప్పుకోవడం వింటుంటే చాలా నవ్వొస్తుంది. పైగా వైకాపకి కంచుకోటవంటి కడప జిల్లాలోనే ఇంత అపనమ్మకం, అనుమానాలు, దయనీయమయిన పరిస్థితి ఉంటే, అధికార తెదేపా బలంగా ఉన్న మిగిలిన జిల్లాలలో వైకాపాను ఏవిధంగా బలోపేతం చేసుకోగలరో ఆయనకే తెలియాలి. ఇంతవరకు నేడో రేపో తెదేపా ప్రభుత్వం కూలిపోవడం ఖాయమన్నట్లు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చే ఎన్నికల వరకు ప్రభుత్వం కొనసాగుతుందనట్లు స్వయంగా చెప్పడం గమనార్హం. ఆయన మాటలు వింటుంటే ఆత్మవిశ్వాసం లోపించినట్లున్నాయి.
అయినప్పటికీ ఆయన ఆలోచనలలో, మాటలలో ఆ వంకరతనం ఇంకా కనిపిస్తూనే ఉంది. ప్రజలలో వ్యతిరేకతను చూసి ఉన్నతాధికారులు, పోలీసులు కూడా వైకాపాకి అనుగుణంగా మార్పు వస్తుందని చెప్పడమే అందుకు ఉదాహరణ. ఈ రాజకీయాలతో అసలు సంబంధంలేని వారి గురించి ఆయన ఆవిధంగా మాట్లాడటం చాలా తప్పు. ఆయన వారిని తన పార్టీకి అనుగుణంగా మారమని సూచిస్తునట్లుంది. లేకుంటే తను అధికారంలోకి వచ్చిన తరువాత అటువంటివారి పని పడతానని గతంలో చాలాసార్లు హెచ్చరించారు కూడా. ఇటువంటి మాటల వలన అధికారులలో ఆయన పట్ల భయం కంటే ఏహ్యత పెరిగే అవకాశమే ఉంటుందని గ్రహిస్తే బాగుంటుంది. తెదేపా ప్రభుత్వంపట్ల ప్రజలలో వ్యతిరేకత పెరిగితే వచ్చే ఎన్నికలలో తప్పకుండా ఆ పార్టీని అధికారంలో నుండి దింపేయవచ్చును. కానీ మధ్యలో అధికారులు, పోలీసుల ప్రసక్తి తేవడం సరికాదు.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని చాలా తపించిపోతున్నప్పటికీ ప్రజలెన్నుకొన్న ప్రజాప్రభుత్వం కూలిపోవాలని లేదా దానిని కూల్చేస్తాననడం చాలా తప్పు. అందుకే ఆయన ఇప్పుడు మూల్యం చెల్లించవలసి వస్తోందని చెప్పవచ్చును. కనుక ఇప్పటికయినా ఆయన తన కల సాకారం చేసుకోవాలనుకొంటే అటువంటి ఆలోనలు చేయడం, అటువంటి దుందుడుకు మాటలు మాట్లాడటం మానుకొని, పార్టీలో సీనియర్ నేతలందరి సహాయ సహకారాలతో మిగిలిన ఈ మూడేళ్ళలో గ్రామస్థాయి నుండి తన పార్టీని బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెడితే మంచిది.