బీజేపీ ఎలాంటి రాజకీయాలు చేస్తుందో తెలిసి కూడా కేటీఆర్ తమకు కొత్త సమస్యలు సృష్టించుకునేలా వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. తాజాగా ఆయన మిలటరీ ఎరియాలకు కరెంట్, నీళ్లు ఆపేస్తామని హెచ్చరించారు. దీని వెనుక ఎలాంటి సమస్య ఉందన్న విషయం పక్కన పెడితే.. ఇలా బెదిరించడం .. అదీ ఆర్మీని బెదిరించడాన్ని ఎవరూ సమర్థించే అవకాశం లేదు. కరెంట్, నీళ్లు టీఆర్ఎస్ లేదా కేటీఆర్ … ఇంకా చెప్పాలంటే ప్రభుత్వ సొత్తు కాదు. మౌలిక సదుపాయాలను ఆపేస్తామనే ఆలోచన పాలకులకు రాకూడదు. కానీ ఇక్కడ కేటీఆర్ ఏకంగా ఆర్మీకే అవి లేకుండా చేస్తామన్నారు.
ఇలాంటి సిట్యూయేషన్ వస్తే బీజేపీ ఊరుకుంటుందా.. రంగంలోకి దిగింది. టచ్ చేసి చూడు అన్నట్లుగా సవాళ్లు చేయడం ప్రారంభించారు. కేటీఆర్ ఉద్దేశం అది కాకపోయినా ఆయన నేరుగా అన్న మాటలే కాబట్టి.. వదిలి పెట్టడం లేదు. ఆర్మీని బీజేపీ రాజకీయాలకు వాడుకున్నట్లుగా ఎవరూ వాడుకోరు. ఇప్పుడు కేటీఆర్ ఆ చాన్స్ బీజేపీకి ఇచ్చారు. చెలరేగిపోతున్నారు. కంటోన్మెంట్ సమస్యను పరిష్కరించుకోవడానికి చాలా మార్గాలున్నాయి. కానీ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మాత్రం.. మొత్తానికి టీఆర్ఎస్ కు నష్టం తెచ్చేలా ఉన్నాయి.
బ్రిటిష్ హయాంలో మిలటరీ అవసరాల కోసం ఏర్పాటు చేసిన కంటోన్మెంట్ బోర్డు భాగ్యనగరం మధ్యలో ఉంది.కంటోన్మెంట్ బోర్డుగా ఇక్కడ పాలన సాగుతోంది. మిలటరీ నిబంధనల ప్రకారం అక్కడ భద్రతా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కంటోన్మెంట్ చుట్టుపక్కల అభివృద్ధి చేయాలంటే.. ఆర్మీ అనుమతి కావాలి. ఇక్కడే ప్రభుత్వానికి కోపం వస్తోంది. బీజేపీపై పోరాటంలో కేటీఆర్ బీజేపీకే అస్త్రాలు అందిస్తూండటం.. టీఆర్ఎస్ నేతల్ని కూడా విస్మయపరుస్తోంది.