బడ్జెట్ సమావేశాల్లో కేసీఆర్ ఎదురు పడాలని ముగ్గురు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు పట్టుదలగా ఉన్నారు. అలాంటి చాన్స్ ఇవ్వబోమని టీఆర్ఎస్ మొదటి రోజే సస్పెన్షన్ వ్యూహం పాటించింది. కోర్టుకెళ్లినా బీజేపీ ఎమ్మెల్యేలకు ఊరట దక్కలేదు. అయితే డివిజన్ బెంచ్‌కు వెళ్లడంతో చివరి రోజు సభకు హాజరయ్యే మార్గం లభించింది. కానీ అది స్పీకర్ అంగీకరిస్తేనే. మంగళవారం ఉదయం స్పీకర్ ఎదుట హాజరవ్వాలని.. స్పీకర్ అనుమతిస్తే సభకు వెళ్లాలని హైకోర్టు సూచించింది. ఈ విషయంలో స్పీకర్ దే తుది నిర్ణయం అని స్పష్టం చేసింది.
ఈ తీర్పు సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యేలు తప్పు చేశారన్నదానికి ఆధారాల్లేవని.. ప్రజాప్రతినిధులు సభలో ఉంటే ప్రజాస్వామ్యం బ లంగా ఉంటుందని స్పష్టం చేసింది. అయితే స్పీకర్ అధికారాల్లో జోక్యం చేసుకునేదానికి నిరాకరించింది. దీంతో మొత్తం వ్యవహారం స్పీకర్ చేతుల్లో ఉంది. కానీ సీఎం కేసీఆర్ బడ్జెట్ సమావేశాల చివరి రోజు సభకు హాజరవ్వాలని నిర్ణయించుకున్నారు. బడ్జెట్ పై ఆయన సభకు సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. బీజేపీ సభ్యులు సభకు రావడం కేసీఆర్‌కు ఇష్టం ఉండదనేది బహిరంగరహస్యం. ఇక స్పీకర్ వారికి అనుమతించడం కూడా కష్టమేనని అంచనా వేయవచ్చు.
నిజానికి హైకోర్టు ఇచ్చిన నోటీసుల్ని తీసుకోవడానికి శాసనసభ వర్గాలు తిరస్కరించింది. స్వయంగా రిజిస్ట్రార్‌ను పంపి నోటీసులు ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించాల్సి వచ్చింది. ఈ కారణంగా హైకోర్టు ఆదేశాలను అసెంబ్లీ అసలు పరిగణనలోకి తీసుకునే అవకాశం కూడా కనిపించడం లేదు. ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు హాజరయ్యే చాన్స్ అయినా వస్తుందో లేదో అంచనా వేయడం కష్టమే