చిత్రసీమకు సంబంధించి ఇటీవల ఏపీ ప్రభుత్వం ఓ జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో రోజుకి 4 ఆటలకు బదులుగా అదనంగా 5వ ఆట ప్రదర్శించుకోవడానికి అనుమతులు ఇచ్చారు. అయితే ఆ 5వ ఆట చిన్న సినిమా కోసం అని స్పష్టంగా ఉంది. కానీ బడా నిర్మాతలు, దర్శకులు ఆ 5వ ఆట తమ సినిమాల కోసం `బెనిఫిట్ షో` కోసమే అని.. భ్రమ పడుతున్నారు. ఇప్పుడు రాజమౌళి కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్లలో భాగంగా ఈ రోజు హైదరాబాద్లో ఓ ప్రెస్మీట్ జరిగింది. ఎన్టీఆర్,చరణ్, రాజమౌళి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో బెనిఫిట్ షోల మాటేంటి? అనే ప్రశ్న రాజమౌళికి ఎదురైంది. దానికి ఆయన చాలా సింపుల్ గా సమాధానం చెప్పేశారు. “ఏపీలో 5 ఆటలకు పర్మిషన్ ఉంది. అంటే.. ప్రతీ రోజూ బెనిఫిట్ షో వేసుకోవచ్చు..“ అని తేల్చేశారు. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే… ఆ 5వ ఆట కేవలం చిన్న సినిమా కోసం కేటాయించింది. పెద్ద సినిమాలు వచ్చినప్పుడు చిన్న సినిమాలకు థియేటర్లకు దొరకడం లేదన్నది ప్రధానమైన ఆరోపణ. అందుకోసమే 5వ ఆట అనే కాన్సెప్టు వచ్చింది. అంతే.. రోజుకి నాలుగు ఆటలూ పెద్ద సినిమాలకే ఇచ్చినా, 5వ ఆట కచ్చితంగా చిన్న సినిమాకి ఇచ్చి తీరాలి. 5వ ఆట కూడా పెద్ద సినిమాకే అనుకుంటే, బెనిఫిట్ షో లా భావిస్తే.. ఇక 5వ ఆట అనే కాన్సెప్పుకి అర్థమేముంది?
అయినా.. పెద్ద సినిమాలు వచ్చినప్పుడు చిన్న సినిమాలు ఎందుకు విడుదల చేస్తారు? ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ బడ్జెట్ సినిమాల ముందు చిన్న సినిమాలు నిలబడగలవా? అన్నదీ ఆలోచించుకోవాల్సిందే. ఒకవేళ చిన్న సినిమా సాహసించి వచ్చినా, 5వ ఆటగా ఏ షోని కేటాయిస్తారు? జనం అంతగా థియేటర్లకు రావడానికి ఇష్టపడని 8 గంటల ఆట.. చిన్న సినిమాకు ఇస్తారా? అలాంటప్పుడు ఇచ్చినా ఉపయోగం ఏముంది? ప్రైమ్ టైమ్ షోస్, ఫస్ట్ షో, సెకండ్ షో ఎలాగూ పెద్ద సినిమాలే కైవసం చేసుకుంటాయి. అలాంటప్పుడు చిన్న సినిమాకి 5వ ఆట కేటాయించాం… అని గొప్పగా చెప్పుకోవడంలో అర్థమేముంది?
తెలంగాణలో బెనిఫిట్ షోల గురించీ రాజమౌళి మాట్లాడారు. బెనిఫిట్ షోలు వేయాలన్న ఆలోచన ఉందని, అయితే… అది పూర్తిగా డిస్టిబ్యూటర్లు తేల్చుకోవాల్సిన విషయమని, దాంతో తమకు సంబంధం లేదన్నారు. తెలంగాణలో 25న తెల్లవారుఝామున 2 లేదా, 3 గంటలకే `ఆర్.ఆర్.ఆర్` ఫస్ట్ షో పడిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది.