హైదరాబాద్ మీడియా సర్కిల్స్‌లో ప్రెస్ క్లబ్ ఎన్నికల హడావుడి ఓ రేంజ్లో సాగింది. ప్యానల్స్ లక్షలు ఖర్చు పెట్టాయి. పబ్లిసిటీ కోసం ఉద్యోగాలను కూడా వారం ..పది రోజుల పాటు పక్కన పెట్టి ప్రచారం చేశారు. గత ఆదివారం ప్రెస్ క్లబ్ మొత్తం పాత జర్నలిస్టులతో కళకళలాడింది. కొత్త జర్నలిస్టుకు ఎలాగూ సభ్యత్వం ఇవ్వరు. అయితే పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ ముగిసింది..కానీ ఫలితాలు మాత్రం ప్రకటించలేదు. దీనికి కారణం… సాధారణ ఎన్నికల్లో జరగాల్సిన అవకతవకలన్నీ అక్కడ జరిగాయి. రిగ్గింగ్ జరిగింది. బ్యాలెట్ బాక్సుల్లో నీళ్లు పోశారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేశారు. చివరికి కేసులు కూడా పెట్టుకున్నారు.
దీంతో ఫలితం ప్రకటించకుండా వాయిదా వేసి వెళ్లిపోయారు ఎన్నికలను పర్యవేక్షించినవారు. ఇప్పుడు బ్యాలెట్ బాక్సులుకూడా పోలీసుల చేతికి పోయినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల్లో అక్రమాలపై రాయమంటే కథలు.. కవితలు… వర్ణిస్తూ రాసే జర్నలిస్టు సీనియర్లు కూడాఈ ఎన్నికల్లో పోటీ పడ్డారు . వారుకూడా ఈ అవకతవకల్లో భాగమయ్యారు. తాము ఆ తాను ముక్కలమే అని నిరూపించారు. ఎవరెవరు గెలిచారో ఓ లిస్ట్ ఇప్పటికే సర్క్యూలేట్ అవుతోంది.కానీ అధికారికప్రకటన మాత్రంలేదు. దీంతో ఇప్పుడు మళ్లీ ఎన్నికలు పెడతారా అన్నచర్చకూడా జరుగుతోంది. అదే జరిగితే.. ఈ సారి మరింత పరువు పోవడం ఖాయం.
ప్రెస్ క్లబ్ ఎన్నికలు జర్నలిస్టుల్లోని మరో కోణాన్ని బయటకు తెచ్చాయి. మా ఎన్నికలకుఏ మాత్రం తగ్గకుండా డ్రామా నడుస్తోంది. అయితే వారి గురించి వారు చెప్పుకోరు..రాసుకోరు కాబట్టి ఈ విషయం ఇంకాలైమ్ లైట్లోకి రాలేదు. ఎలా చూసినా సీనియర్ జర్నలిస్టుల .. ఎన్నికల్లో పోటీ చేసి.. తాము నిత్యం చెప్పే సూక్తులకు వ్యతిరేకంగా గూండాయిజం చేసి.. జర్నలిస్టుల పరువును సోమాజిగూడ రోడ్లపై పడేశారు