కోమటిరెడ్డి సోదరులు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఓ వైపు ఎంపీ కోమటిరెడ్డి ప్రధానిని కలిసి గొప్పగా చెప్పుకుంటూంటే.. మరో వైపు ఎమ్మెల్యే కోమటిరెడ్డి అసెంబ్లీలో కేంద్రాన్ని సమర్థిస్తూ మాట్లాడి కలకలం రేపారు. దీంతో వారు బీజేపీ బాట పట్టడం ఖాయమని ఎక్కువ మంది కాంగ్రెస్ నేతలు నమ్ముతున్నారు. నల్లగొండలో బీజేపీకి బలమైన నేతలు లేరు. వీరు వస్తే ఉమ్మడి నల్లగొండ జిల్లామొత్తం పట్టు సాధించవచ్చని నమ్ముతున్నారు.
ఇప్పటికే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పలుమార్లు తాను బీజేపీలో చేరనున్నట్టు బహిరంగంగానే ప్రకటించారు. నాగార్జునసాగర్ ఉపఎన్నిక సమయంలోనూ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి సాగర్ ఉపఎన్నికలో బీజేపీ తరపున పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఆయన గొంతెమ్మ కోరికలు కోరారని అందుకే తర్వాత పట్టించుకోలేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు పరిస్థితి ఇంకా దిగజారిందని.. కాంగ్రెస్ పార్టీ రోజురోజూకూ బలహీనపడుతున్నందునే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది.
వెంకట్ రెడ్డికి ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వడం.. తెలంగాణ రాజకీయ పరిస్థితులపైన చర్చించడం వెనుక కారణాలు చర్చనీయాంశంగా మారాయి. త్వరలోనే బ్రదర్స్ ఇద్దరూ ప్రధాని మోదీ, అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం జరుగుతోంది. కిషన్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్ ఈ చేరికల మిషన్ ను కంప్లీట్ చేసినట్లుగా చెబుతున్నారు. ఈటల రాజేందర్ ను కూడా పార్టీలో చేర్చడంలో వీరే కీలక పాత్ర పోషించారు.