అధికారంలోకి వచ్చేటప్పుడు చుట్టూ ఎవరున్నారు ?
అమ్మ ఉన్నారు ! చెల్లి ఉన్నారు ! తండ్రి హత్యకు గురైనా రాజకీయంగా అన్నకు చెడ్డ పేరు రాకూడదని చెప్పిన స్టేట్మెంట్లు ఇచ్చిన మరో చెల్లి ఉన్నారు..! కుటుంబం మొత్తం ఉంది ! అధికారంతో సంబంధం లేకుండా అభిమానించే వారు ఉన్నారు ! పార్టీ కార్యకర్తలు ఉన్నారు ! నేతలు ఉన్నారు ! క్రిస్టియన్లు ఉన్నారు ! ముస్లింలు ఉన్నారు ! రెడ్లు ఉన్నారు ! అందరి మద్దతుతో అనితర సాధ్యమైన విజయాన్ని అందుకున్నారు. చుట్టూ అందరూ రక్షణ కవచాల్లా నిలిచి విజయం అందించి నెత్తి మీద కిరీటం పెట్టారు.
మూడేళ్లపోయింది… ఇప్పుడు చుట్టూ ఎవరున్నారు ?
అమ్మ ఉందా ..? లేదు. తోడబుట్టిన చెల్లి.. బాబాయ్ కడుపున పుట్టిన చెల్లి ఎవరూ లేరు. కుటుంబంలో ఎంత మంది ఉన్నారో చెప్పలేరు. అభిమానించే వారు ఎంత అభిమానిస్తున్నారో చెప్పలేము. పార్టీ కార్యకర్తలు కూడా స్వచ్చందంగా ఆవిర్భావ దినోత్వసం చేయడానికి ముందుకు రాలేదు. క్రిస్టియన్లు సైతం అసంతృప్తిగా ఉన్నారని స్వయంగా బ్రదర్ అనిల్ కుమార్ స్టేట్ మెంట్ ఇచ్చారు. ఇస్లామిక్ బ్యాంక్… దుల్హన్ పథకాల పేరుతో అరచేతిలో స్వర్గాలు చూపించి నిట్ట నిలువునా ముంచేశారని ముస్లింలూ దూరమయ్యారు. రెడ్లు తమలో తాము కొట్టుకుంటున్నారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఎంతో బాధతో చెప్పారు. వారిలో ఎంత మంది వెంట ఉంటారు ? చెప్పడం కష్టం.
ఓవరాల్‌గా ఒక్క సారి తల పరికించి.. చుట్టూ చూస్తే.. కనిపించేది ఒక్కటే. ఆల్ ఇన్ వన్.. ఒక్కరే. ఆయనే సకల శాఖల మంత్రిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి మాత్రమే !
ఇదంతా ఎవరి గురించో కాదు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గురించే. అధికారం చేపట్టేటప్పుడు ఆయన చుట్టూ ఎంతో మంది ఆత్మీయులు ఉండేవారు. కానీ ఇప్పుడు వారంతా ఆయనకు దూరమయ్యారు. ఇప్పుడు ఆయనచుట్టూ ఉన్నవారంతా అవసరానికి ఉన్నవారే తప్ప ఆత్మీయులు కాదు. కాలు ముందుకేస్తే ఎదురుపడేది సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే. ఆయన ఒక్కరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మిగిలారు. ఇంకెవరూ మిగల్లేదు.
కుటుంబం ఎందుకు దూరం అయింది ?
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు యొదుగూరి సందింటి కుటుంబంలో విభేదాలు ఉన్నాయన్న వార్తే బయటకు రాలేదు. అలాగని కుటుంబంలో పొరపొచ్చాలు ఉండవని కాదు. కానీ పెద్ద మనిషి తరహాలో ఆలోచించి.. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని వైఎస్ ప్రకటించేవారు. ఎవరైనా అసంతృప్తికి గురైనా.. నోరెత్తలేని పరిస్థితి కల్పించేవారు, కుటుంబాన్ని ఒక్కటిగా ఉంచారు. ఎవరికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వారికి ఇచ్చారు. అయితే తండ్రి బాధ్యతలు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని ఏకతాటిపైన ఉంచడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఎంత విఫలం అయ్యారంటే.. చివరికి కన్న తల్లితో కూడా మాటల్లేని పరిస్థితి వచ్చింది. ఇక చెల్లితో వివాదాల గురించి చెప్పాల్సిన పని లేదు. వైఎస్ కుటుంబంలో భార్య తరపు బంధువులు తప్ప.. ఇతరులతో సన్నిహిత సంబంధాలు పూర్తిగా కొరవడ్డాయి. కుటుంబ ఏకతాటిపై ఉంటేనే రాజకీయంగా కూడా బలంగా ఉంటారు. కానీ కుటుంబాన్నే జగన్ ఏకతాటిపైకి ఉంచలేకపోయారు. ఇలా ఎందుకు జరిగిందో జగన్ విశ్లేషించుకున్నారా ?
ఆత్మీయులు ఎందుకు దూరం అయ్యారో ఆలోచించారా !?
ఎన్నికలకు ముందు అధికారంతో సంబంధం లేకుండా ఎంతో మంది ఆత్మీయులు జగన్ చుట్టూ ఉండేవారు. ఆయనను అధికారంలోకి తీసుకు రావడమే లక్ష్యంగా పని చేసేవారు. వారు ఎలాంటి వారు..ఎంత మంది ఉంటారనేది.. బయట వారి కన్నా.. అక్కడ ఉండే వారికి తెలుసు . కానీ ఇప్పుడు వారిలో ఎంత మంది జగన్ ఇంటి దగ్గర ఉంటున్నారు ?. వేళ్ల మీద లెక్కపెట్టగలిగిన వారే ఉంటున్నారు. అది కూడా తప్పనిసరిగా.. అభిమానంతోనే ఉంటున్నారు. అధికారం వచ్చింది కదా అని.. చుట్టూ చేరిన వారే ఇప్పుడు ఉన్నారు. అధికారం పోతే వారు ఉంటారో లేరో చెప్పడం కష్టం. అలాగని.. పాత వాళ్లంతా మళ్లీఅదే అభిమానంతో వస్తారని ఆశించడం కూడా వృధానే.
ఓట్లేసిన వాళ్లు .. వేయించిన వాళ్లు ఎందుకు బాధపడుతున్నారో జగన్ ఆలోచించారా ?
గత ఎన్నికల్లో జగన్‌ను సీఎం చేయడానికి వైసీపీని గెలిపించడానికి శాయశక్తులా ప్రయత్నించాం. కానీ మాకు కనీసం అపాయింట్ మెంట్ కూడా లేదు.. మా బాధలు వినేవారు లేరని.. క్రిస్టియన్ సంఘాలు బ్రదర్ అనిల్ కుమార్‌తో గోడు వెళ్లబోసున్నాయి. బ్రదర్ అనిల్ కూడా అదే చెప్పాడు. తనకు కూడా రెండున్నరేళ్ల నుంచి అపాయింట్ మెంట్ లేదని. నిజానికి దేశంలో క్రిస్టియన్లు ఏ ఒక్క రాజకీయ పార్టీని ప్రత్యేకంగా తమ పార్టీ అనుకోలేదు. కానీ ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని అనుకున్నారు. అలా అనుకోవడానికి ప్రధాన కారణం జగన్ క్రైస్తవ మతం ఆచరించడం కాదు.. మత ప్రచారకునిగా ఊరూవాడా తిరిగి.. చర్చిల్లో.. జగన్ మనోడు అని చెప్పి.. వారి మనసులోకి ఎక్కించిన ప్రార్థనలు చేయించిన బ్రదర్ అనిల్ అండ్ టీంది. ఈ విషయం జగన్‌కు తెలిసినంతగా ఎవరికీ తెలియకపోవచ్చు. అలాంటి వారు కూడా ఇప్పుడు తమను పట్టించుకోవడం లేదని రోడ్డెక్కుతున్నారు. ఎందుకిలా జరుగుతుందో జగన్ విశ్లేషణ చేసుకున్నారా ?
రోజుకు ఎంత మందిని రోడ్డెక్కకుండా నిర్బంధించాల్సి వస్తుందో తెలుసుకుంటున్నారా ?
ఆశా వర్కర్ల నుంచి అంగన్వాడి వర్కర్ల వరకు… ఎవరు ఎప్పుడు రోడ్డెక్కుతారో తెలియని పరిస్థితి. కొన్ని వందల మంది పోలీసుల్ని విజయవాడ గుంటూరు వైపు మోహరించి.. ఎవరెవరు.. ఎక్కడ్నుంచి వస్తున్నారో చూసుకోవాల్సి వస్తోంది. ఆందోళనల కోసం ఎవరూ విజయవాడ, గుంటూరు రాకుండా పోలీసులకు పర్మినెంట్ డ్యూటీ పడింది. ఇంకా ముందుగానే చివరికి అంగన్వాడీ ఆయాలను కూడా హౌస్ అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వీరంతా జగనన్న సర్కార్ కోసం పోరాడిన వాళ్లే. గత ప్రభుత్వం నిప్పులు చెరిగి తానొస్తే అన్నీ చేస్తానని చెప్పడంతోనే నమ్మినవాళ్లు. ఇప్పుడు వాళ్లందరికీ ఎందుకు న్యాయం చేయడం లేదు. ఎవరో ఎందుకు.. తిరుపతిలో ఓ టీటీడీ పారిశుద్ధ్య కార్మికురాలు తమ ఉద్యోగం పర్మినెంట్ చేస్తామని పాదయాత్రలో హామీ ఇచ్చారని తన చేతిలో జగన్ పచ్చబొట్టు వేయించుకుంది. కానీ ఆమేకేం న్యాయం చేశారు. తిరుపతిలోనూ పిలిపించుకుని తల మీద చేయి పెట్టి అభయం ఇచ్చి.. చివరికి జైల్లో తోశారు. ఆమె పెట్టిన శాపనార్థాలు వింటే.. సీఎం జగన్ తానేం చేస్తున్నారో రివ్యూ చేసుకునేందుకు సిద్ధపడి ఉండేవారు.
సొంత కార్యకర్తలు ఎందుకు దూరమవుతున్నారు ?
పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుందామని పిలిపునిస్తే.. ఎమ్మెల్యేలు.. ఇతర రాష్ట్ర స్థాయి పదవులు ఉన్న వారు మాత్రమే తూ.. తూ మంత్రంగా జెండా ఎగరేసి..రెండు మిఠాయిలు పంచి.. ప్రతిపక్షాన్ని తిట్టి ఇంటికెళ్లిపోయారు. కానీ కార్యకర్తలు అనేవారిలో ఉత్సాహం ఎక్కడా కనిపించలేదు. ఎందుకంటే… సీఎం జగన్ ఎన్నికలకు ముందు మన ప్లేట్లో మన బిర్యానీ అనే మాటలు చెప్పి చాలా మంది ఇన్ స్పయిర్ అయ్యారు. కానీ మూడేళ్లతో పోలిస్తే.. మన ప్లేటు లేదు.. మన బిర్యానీ లేదని వారికి అర్థమైపోయిది. చివరికి తమ ఊళ్లలో ఉండే ఇసుక నుంచి కూడా కాస్తంత ఆదాయం తెచ్చుకునే అవకాశం లేకుండా చేశారు. అంతా వ్యవస్థీకృతంగా ఒకరికే వెళ్లేలా చేశారు. అంతేనా.. పార్టీ అధికారంలోకి వచ్చిందని చిన్నా చితకా పనులు చేయించేసిన నేతలు.. తమ అనుచరుకు బిల్లులు ఇప్పించడం తలకు మించిన భారంగా మారింది. ఆ బిల్లులు రాక సొంత కార్యకర్తలే డీలా పడిపోయారు. ఇక పైసా ఖర్చు పెట్టుకోలేమనే పరిస్థితికి వెళ్లిపోయారు. ఇలా ఎందుకు జరుగుతుదో జగన్ ఆలోచిస్తారా ?
ప్రతిపక్షంలో ఉన్నప్పుడుదగ్గర తీసిన టీఆర్ఎస్, బీజేపీ ఇప్పుడు అలాగే ఉన్నాయా ?
అధికారంలోకి రాక ముందు టీఆర్ఎస్ గొప్ప దోస్తీ ఉన్న పార్టీ. గెలవగానే.. ముందుగా కేసీఆర్ దగ్గరకు వెళ్లారు. టీడీపీపై పోరాటంలో హైదరాబాద్ నుంచి వచ్చిన సాయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బీజేపీ కూడా అంతే. కానీ ఇప్పుడు ఈ రెండు పార్టీలు అంత ఆత్మీయంగా ఉన్నాయా..? అంటే చెప్పడం కష్టం. టీఆర్ఎస్ .. ఏపీ పాలనను అవహేళన చేస్తోంది. వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టడాన్ని తప్పు పడుతోంది. ప్రజల్లో వ్యతిరేకత పెంచుతోంది. బీజేపీ .. పైకి సహకరిస్తున్నట్లుగా ఉంది కానీ.. పలు కేసుల్లో నిండా ముంచుతోందని.. తమపై ప్రజా వ్యతిరేకత పెరగడానికి తన వంతు కృషి చేస్తోందని.. కాస్త రాజకీయంగా ఆలోచించినా అర్థమైపోతోంది. ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందో సీఎం ఆలోచిస్తారా ?
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆత్మీయులైన అధికారులు ఇప్పుడు ఉన్నారా ?
జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక మంది సివిల్ సర్వీస్ అధికారులు ఆయనతో టచ్‌లో ఉన్నారు. మీరు అధికారంలోకి రావాలి సర్ అని ఆయన వెంట పడిన వాళ్లు చాలా మంది ఉన్నారు. అధికారంలోకి రాక ముందే ఆయనను పల్లకీలో ఊరేగించిన వారు ఉన్నారు. వారిలో ఇప్పుడు జగన్‌కు ఎంత మంది ఆత్మీయులు ఉన్నారు. ఓ పీవీ రమేష్ కావొచ్చు.. మరో రామచంద్రమూర్తి కావొచ్చు..ఎంతో మంది ఆత్మీయులు జగన్‌కు దూరం వెళ్లిపోయారు. వెళ్లిపోయారు అనడం కన్నా దూరం చేసుకున్నారు అనుకోవచ్చు. ఎందుకిలా జరుగుతోంది !
ఇప్పుడు జగన్ అంటే సజ్జల.. సజ్జల అంటే జగన్ !
ఇప్పుడు జగన్‌కు ఉన్నది సజ్జల మాత్రమే. వైసీపీ కోసం విజయసాయిరెడ్డి చేసినంత ఎవరూ చేయలేదు. ఢిల్లీలో ఎవరి కాళ్లు పట్టుకోవాల్సి వచ్చినా వదిలి పెట్టలేదు. అలాంటి విజయసాయిరెడ్డిని కొన్నాళ్లుగా ఎన్ని అవమానాలు పెట్టాలో అన్నీ పెడుతున్నారని వైసీపీలో చెప్పుకుంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. సాక్షికి పిల్లర్లుగా ఉన్న వాళ్లెవరూ లేరు. కుటుంబం.. పార్టీ .. ఆత్మీయులు.. కార్యకర్తలు అందరూ ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు. కానీ సజ్జల మాత్రమే దగ్గరవుతున్నారు. జగన్ అంటే ఇప్పుడు సజ్జల మాత్రమే కనిపిస్తున్నారు. అది కుటుంబ విషయాలైనా.. పాలనా విషయాలైనా.. మరొకటైనా.! సజ్జల మీద జగన్ ఎంత దారుణంగా డిపెండ్ అయ్యారో.. సజ్జల ఎంత ప్లాన్డ్గా అందర్నీ దూరం చేశారో జగన్ ఒక్క సారి ప్రశాంతంగా కూర్చుని మూడేళ్ల కిందటి పరిస్థితుల్ని.. ఇప్పటి పరిస్థితుల్ని బేరీజు వేసుకుంటే సినిమా అర్థమైపోతుంది. కానీ అలాంటి పని చేయాలన్నా ఇప్పుడు సజ్జల చెప్పాల్సిన పరిస్థితి.
ఏం కోల్పోతున్నారో సీఎం జగన్‌కు అర్థమవుతుందా !?
మన కోసం నలుగుర్ని కాపాడుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు. అధికారం వచ్చిందని ఆస్తులు వచ్చాయని … గర్వానికి పోతే… చివరికి ఆ ఆస్తులే ఉంటాయి.. తప్ప మనుషులు ఉండరు. ఆత్మీయులు ఉండరు. ఇది చరిత్రలో ఎంతో మంది విషయంలో నిజమైన కఠోర వాస్తవం.
రాజకీయాల్లో వ్యక్తిగత గెలుపులు ఎప్పుడూ ఉండవు. మన కోసం ఎంత మంది ఉంటారన్నదానిపైనే గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి తనను తాను సమీక్షించుకోవాలి. ఎం జరిగిందో.. ఏం జరుగుతుందో..అర్థం చేసుకోవాలి. కరెక్ట్ చేసుకోవాలి. అప్పుడే ఆయన రైట్ ట్రాక్‌లోకి వస్తారు. లేకపోతే ఆయన మళ్లీ పాత స్థానానికి వెళ్తారు. మామూలుగా అయితే ఎవరికీ ఇలాంటి విషయాల్లో పట్టింపులేదు. కానీ ఆయన పనితీరు రాష్ట్రానికి సంబధించినది. ఏచిన్న తేడా వచ్చినా ప్రజల భవిష్యత్ అంధకారం అవుతుంది. అందుకే జగన్.. మూడేళ్ల కిందట తనతో ఎవరున్నారు.. ఇప్పుడు వారెందుకు లేరో విశ్లేషించకుకుని ముందడుగు వేయాలి. లేకపోతే.. మొదటికే మోసం వస్తుంది.