ఉన్నట్లుండి టీడీపీ అధినేత చంద్రబాబుపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెగాసస్ సాఫ్ట్ వేర్‌ను చంద్రబాబు కొన్నారని ఆమె ప్రకటించారు. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్వో కంపెనీ తమను సంప్రదించిందని.. తాము కొనలేదని కానీ అప్పట్లో చంద్రబాబు కొన్నారని ఆమె ప్రకటించారు. అలా ఎందుకు ప్రకటించారో కానీ ఏపీలో మాత్రం ఈ అంశం చర్చనీయాంశం కావడం ఖాయంగా కనిపిస్తోంది.
పెగాసస్‌కు రూ. పాతిక కోట్లు ఖర్చు డిమాండ్ చేసినట్లుగా మమతా బెనర్జీ చెబుతున్నారు. అయితే దీదీ ఆరోపణలను నారా లోకేష్ తోసి పుచ్చారు. తామే గనుక పెగాసస్ కొనుగోలు చేసి ఉంటే.. జగన్ సర్కార్ ఇంత కాలం ఎందుకు సైలెంట్‌గా ఉండేదని ఆయన ప్రశ్నించారు. మమతా బెనర్జీకి సరైన సమాచారం లేక అలా మాట్లాడి ఉంటారన్నారు. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్వో గ్రూప్ నుంచి… కేంద్రం పెగాసస్‌ను కొనుగోలు చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. కేవలం ప్రభుత్వాలకే వాటిని అమ్ముతారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేశాయని ఎక్కడా వార్తలు రాలేదు. కానీ అనూహ్యంగా ఇప్పుడు చంద్రబాబు పేరు మమతా బెనర్జీ లాగారు.
పెగాసస్‌తో చంద్రబాబు నిఘా పెట్టి ఉంటే తమకీ ఈ దుస్థితి ఎందుకని టీడీపీ నేతలు కూడా సెటైర్లు వేసుకుంటున్నారు. నెల్లూరు ఎంపీగా ఉన్న అదాల ప్రభాకర్ రెడ్డి టిక్కెట్ తీసుకుని.. ప్రభుత్వ బిల్లులు ఐదు వందల కోట్లు మంజూరు చేయించుకుని రాత్రికి రాత్రి వైసీపీలో చేరిపోయారు. ఇలాంటి కోవర్టులు చాలా మంది ఉన్నారు. వారిలో ఒక్కర్నీ గుర్తించలేకపోయారు. ప్రతిపక్షాల వ్యూహాలను గుర్తించలేకపోయారు. కనీసం ఇంటలిజెన్స్ వ్యవస్థను కూడా పక్కాగా వాడుకోలేకపోయారని టీడీపీ నేతలు అంటున్నారు.
మొత్తంగా పెగాసస్ వ్యవహారంలో మమతా బెనర్జీ వ్యాఖ్యలు ఇప్పుడు.. రాజకీయంగా వైసీపీకి అస్త్రంగా దొరికినట్లే అనుకోవాలి. అసలు నిజాలేంటో చెప్పే అధికారం ఉన్నా.. ఆరోపణలు చేయడలోనే రాజకీయం చేయగలిగే వైసీపీ దీన్ని వదులుకునే అవకాశం లేదని సులువుగానే గుర్తించవచ్చు.