తెలంగాణ సీఎం కేసీఆర్ అత్యవసరంగా మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహిచారు. అయితే అధికారిక మంత్రివర్గ సమావేశం కాదని తెలుస్తోంది. ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌లో ఉన్న కేసీఆర్ అత్యవసరంగా పిలుస్తున్నారని మంత్రులకు ఉదయం సమాచారం అందింది. ముగ్గురు మంత్రులు మినహా అందరూ ఫామ్‌హౌస్‌కు వచ్చారు. పువ్వాడ అజయ్ ఖమ్మంలో ఉండగా.. మరో మంత్రి ప్రశాంత్ రెడ్డి మహారాష్ట్రలో ఉన్నారు. ఇక కేటీఆర్ ఉదయమే అమెరికా కు బయలుదేరి వెళ్లారు. ఈ ముగ్గురు మినహా అందరూ హాజరయ్యారు.
మంత్రులతో జరిగిన సమావేశానికి చీఫ్ సెక్రటరీతో పాటు కొంతమంది ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశం ఎజెండా ఏమిటన్నదానిపై స్పష్టత లేదు. పాలనాపరమైన అంశాలు చర్చిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఇంత అర్జెంట్‌గా అందర్నీ పిలిపించుకుని చర్చించాల్సిన అవసరం ఏమిటన్నది చాలా మందికి అర్థం కాని విషయం.
కేసీఆర్ ఇటీవల ముందస్తు ఎన్నికల హడావుడిలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. దాన్ని బలపరిచేలా.. జిల్లాల పర్యటనలు.. శంకుస్థాపనలు.. పథకాలు .. ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకటిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ కూడా తెలంగాణలో సర్వే చేసి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రతిపక్షాలు ఇప్పటికి పూర్తి స్థాయిలో ససన్నద్ధం కాలేదని.. ఇప్పుడు ఎన్నికలకు వెళ్తే మంచి ఫలితాలు వస్తాయని కేసీఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. భేటీ తర్వాత కేసీఆర్ వేసే అడుగులను బట్టి ముందస్తు చర్చల కోసమా.. లేకపోతే.. ఇతర చర్చల కోసం సమావేశం జరిగిందా అన్నది స్పష్టత వచ్చే అవకాశం ఉంది.