ఇంకొద్ది రోజుల్లో ఆర్.ఆర్.ఆర్ విడుదల అవుతోంది. మీడియాలో ఎక్కడ చూసినా… ఈ సినిమాదే సందడి. ప్రమోషన్లు, ఇంటర్వ్యూలు, స్పెషల్ స్టోరీలు, ప్రెస్ మీట్ కవరేజీలూ.. ఒకటి కాదు. రాజమౌళి టీమ్ కూడా ప్రమోషన్లని బాగానే ప్లాన్ చేసింది. స్పెషల్ గా వీడియో ఇంటర్వ్యూలు చేసి వదులుతోంది. అనిల్ రావిపూడితో రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్‌లు కలిసి చేసిన ఇంటర్వ్యూ బాగా హైలెట్ అయ్యంది. ఇప్పుడు ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి చిట్ చాట్ కూడా.. అంతే హైలెట్ అయ్యింది. ఇలా.. ఏ ఛానల్ చూసినా, పేపర్ తిరగేసినా.. ఇదే కథ.
అయితే ఈనాడులో మాత్రం ఆర్.ఆర్.ఆర్ కవరేజీ అంతగా కనిపించడం లేదు. మిగిలిన సినిమాలకు ఎంత కవరేజ్ ఇస్తున్నారో, ఆర్.ఆర్.ఆర్కీ అంతే ఇస్తున్నారు. స్పెషల్ ట్రీట్మెంట్ ఏమీ లేదు. బాహుబలి 2, బాహుబలి 2 పమయంలో… ఈనాడు ఇచ్చిన కవరేజ్ మరే పేపర్, ఛానల్ ఇవ్వలేదు. ఈనాడు చరిత్రలోనే ఓ దర్శకుడి ఫుల్ పేజీ ఇంటర్వ్యూ కవర్ చేయడం.. బాహుబలి సమయంలోనే జరిగింది. రాజమౌళి అనే కాదు.. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్లు, నటీనటుల ఇంటర్వ్యూలు భారీగా ఇచ్చింది. ప్రతీ చిన్న మూమెంట్ ని కవర్ చేసింది. సినిమా విడుదలైన తరవాత రివ్యూ కూడా ఇచ్చింది. `వెండి తెరకే విందుభోజనం` అంటూ హెడ్డిగులు పెట్టి, ఎప్పుడూ, ఏ సినిమాకీ ఇవ్వలేనంత మైలేజీ ఇచ్చింది.
అయితే.. ఆర్.ఆర్.ఆర్కీ ఇవేం లేవు. స్పెషల్ ఇంటర్వ్యూలు లేవు. స్పెషల్ ఫీచర్లు లేవు. ఇచ్చామా, లేదా? అన్నట్టే కవరేజ్ ఉంది. దానికీ ఓ కారణం ఉంది. బాహుబలి సినిమా మొత్తం రామోజీ ఫిల్మ్ సిటీలోనే తీశారు. ఆర్.ఆర్.ఆర్ విషయంలో అది జరగలేదు. ఈ సినిమా సెట్లన్నీ… అల్యూమినియం ఫ్యాక్టరీలోనే వేశారు. ఈ సినిమా వల్ల రామోజీ ఫిల్మ్ సిటీకి ఒక్క రూపాయి ఆదాయం లేదు. అందుకే ఈ సినిమాని ఈనాడు లైట్ తీసుకొంది.
బాహుబలికీ, ఆర్.ఆర్.ఆర్కీ ప్రమోషన్ ప్లానింగ్ కూడా మార్చేశాడు రాజమౌళి. ఈసారి ఇంకొంచెం ఎగ్రసీవ్ గా ప్రమోషన్లు చేస్తున్నాడు. టీమ్ లో చాలామందే ఉన్నా ఎన్టీఆర్, చరణ్‌లను తాను వెంట బెట్టుకుని తిరుగుతున్నాడు. బాహుబలి విషయంలో మీడియా సంస్థలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కావల్సినదానికంటే ఎక్కువ కవరేజీ ఇచ్చాయి. కానీ ఆర్.ఆర్.ఆర్ విషయంలో అది జరగడం లేదు. ఇది గమనించిన రాజమౌళి.. తనే ముందుకొచ్చి ఎగ్రసీవ్ స్టెప్ వేశాడు. మీడియా అటెన్షన్ డ్రా చేయడానికి ఎన్ని మార్గాలున్నాయో, వాటన్నింటినీ వాడుకున్నాడు. అందుకే బాహుబలి కంటే.. ఎక్కువ ప్రమోషన్ ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ కి అందుతోంది.