విపత్తులు సంభవించినప్పుడు నష్టపోయిన రైతులకు ఇవ్వాల్సిన రూ. వెయ్యి కోట్లను సీఎం జగన్ మళ్లించినట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మొత్తాన్ని ఇన్పుట్ సబ్సిడీ పేరుతో పంపిణీ చేశారని.. వాస్తవంగా రైతులకు ఇవ్వాల్సిన పరిహారాన్ని ఇవ్వలేదని కేంద్ర ఆర్థిక మంత్రి పంకజ్ చౌదరి ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం కేంద్ర నిధులు మళ్లించిందో లేదో చెప్పాలని ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. ఇందులో చాలా నిధులు మళ్లించినట్లుగా కేంద్రమమంత్రి చెప్పారు.
ఏపీకి కేంద్రం రాష్ట్ర విపత్తు నిధికి కేంద్ర వాటా కింద రూ.324.15 కోట్లు… జాతీయ విపత్తు నిధి కింద రూ.570.91 కోట్లు ఇచ్చింది. అయితే ఈ నిధులన్నీ మళ్లించినట్లుగా తెలిపారు. రూ.1,100 కోట్ల విపత్తు నిధులను ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ అగ్రికల్చర్ ఖాతాకు మళ్లించారు. ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు ఆ నిధులను మళ్లించారని కేంద్రమంత్రి తన సమాధానంలో తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు మాత్రం ఆ నిధులు అందించలేదని తెలిపింది. అలాగే ఈ వ్యవహారం విపత్తు నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలు.. ఇతర నిధులకు సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని విపక్ష తెలుగుదేశం కొన్ని రోజులుగా ఆరోపిస్తోంది. ఈ మేరకు విపత్తు నిధులపై అడిగిన ప్రశ్నలకు కేంద్రం నిజమేనని సమాధానం ఇచ్చింది. అయితే కేంద్రం ఇలా నిధులు మళ్లించినందుకు ఏం చర్యలు తీసుకుంటుందన్నాదనిపై ఎలాంటి స్పష్టమైన సమాచారం రాలేదు.