నిన్నా మొన్నటి వరకూ ఏపీలో టికెట్ రేట్లు తక్కువని గోల. ఇప్పుడు అది రివర్స్ అయ్యింది. ఎందుకంటే.. సడన్ గా టికెట్ రేట్లు పెరిగాయి. ఆర్.ఆర్.ఆర్కి స్పెషల్ గా ఇచ్చిన వెసులుబాటు వల్ల… టికెట్ రేటు మరింత భారంగా మారింది. మరోవైపు తెలంగాణలోనూ టికెట్ రేట్లు పెంచుకునే వెసులు బాటు ఇచ్చారు. తొలి మూడు రోజులు ఒకలా, తదుపరి 7 రోజులూ మరోలా టికెట్ రేట్లు ఉండబోతున్నాయి. పది రోజుల్లో రావల్సిందంతా రాబట్టుకోవడం సులభం కాబట్టి, ఆర్.ఆర్.ఆర్కి ఇది కచ్చితంగా ప్లస్ పాయింటే. కానీ ఈ రేట్లు సామాన్యుడికి అందుబాటులో ఉంటాయా అనేది ప్రశ్న.
తెలంగాణలో తొలి మూడు రోజుల్లోనూ టికెట్ ధర.. మల్టీప్లెక్స్ లో అయితే 413 రూపాయల వరకూ ఉంది. సింగిల్ థియేటర్ లో అయితే టికెట్ రేటు 236 రూపాయలు. 4వ రోజు నుంచి సింగిల్ థియేటర్లో 212 రూపాయలు. మల్టీప్లెక్స్ లో అయితే.. 354 ఉంది. ఏపీలో టికెట్ ధర కాస్త అందుబాటులో ఉందని చెప్పాలి. తొలి 10 రోజులకు కనిష్టంగా రూ.106 ఉంటే, గరిష్ట ధర… 380 ఉంది.
మరో వైపు ప్రిమియర్ షోలు, ఫ్యాన్స్ షోల హడావుడి ఉండనే ఉంది. ప్రీమియర్ షో టికెట్ ధర. 2వేలు. అది ఇంకా పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. రాధే శ్యామ్ ప్రీమియర్ షో టికెట్ హైదరాబాద్ లో రూ.2,500 పలికింది. ఆర్.ఆర్.ఆర్ కి ఉన్న హైప్ దృష్టిలో పెట్టుకుంటే.. ప్రీమియర్ కూడా అందరికీ అందరి ద్రాక్షలానే ఉంది. మామూలు రోజుల్లో ఓ కుటుంబం మొత్తం ఆర్.ఆర్.ఆర్కి వెళ్లాలంటే కనీసం 2 వేలు సమర్పించుకోవాల్సిందే. మల్టీప్లెక్స్ ఎంచుకుంటే ఇంకాస్త భారం అవ్వడం ఖాయం.
మొన్నటి వరకూ టికెట్ రేట్లు తక్కువగా ఉన్నాయని బాధ పడిపోయినవాళ్లంతా.. ఇప్పుడేమంటారో చూడాలి.