సోమవారం కేసీఆర్ పూర్తి స్థాయి శాసనసభా పక్ష సమావేశానికి పిలుపునివ్వడం టీఆర్ఎస్లోనూ సంచలనం అయింది. పైకి మాత్రం వడ్ల కొనుగోలుపై కేంద్రంపై యుద్ధానికని చెబుతున్నారు. కానీ దాని కోసమే అయితే టీఆర్ఎస్ఎల్పీ భేటీ అవసరం ఉండదు. కేసీఆర్ పిలుపునిస్తే చాలు. కానీ కాస్త కీలకమైన నిర్ణయం తీసుకోవడానికే ఈ పిలుపు అని ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఆ నిర్ణయం అప్పటికప్పుడు ప్రకటించకపోయినా … కొన్ని సంకేతాలు మాత్రం ఈసమావేశంలో వస్తాయని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఆగస్టు తర్వాత కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేస్తారని చెబుతున్నారు. దానికి తగ్గట్లుగానే కేసీఆర్ .. తనకు వ్యతిరేకంగా ఉన్నాయనుకున్న వాటినన్నింటినీ … మళ్లీ కరెక్ట్ చేసుకోవడానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో అనేక కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చారు. అయితే ఇవన్నీ మధ్యలోనే ఉన్నాయి. ప్రకటనలుగానే ఉన్నాయి. అమలు చేయాల్సి ఉంది.
అదే సమయంలో ముందస్తుకు వెళ్లడానికి కేటీఆర్ ఇష్టంగా లేరని చెబుతున్నారు. ఇంకా ఏడాదిన్నర ఉన్నందున కేటీఆర్‌ను సీఎం చేసి.. సరైన సమయంలోనే ఎన్నికలకు వెళ్లడం మంచిదనే సలహాలు పార్టీలోని ఓ వర్గం నుంచి వస్తున్నాయి. అప్పటికి కేటీఆర్ నిరూపించుకుంటారని … సీన్ మారిపోతుందన్న అంచనాలు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. అయితే కేంద్రంపై వడ్ల పోరు చేయడం అనేది చెప్పుకోవడానికే కానీ.. అసలు విషయం మాత్రం రాజకీయమేనని ఎక్కువ మంది టీఆర్ఎస్ నేతలు నమ్ముతున్నారు. అసలేం జరుగుతుందో సోమవారం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.