వైసీపీ ఎమ్మెల్యేల ముందు ఇప్పుడు ఒకటే లక్ష్యం ఉంది అది త్వరలో మారబోయే కేబినెట్లో చోటు దక్కించుకోవడం.. ప్రస్తుతం ఉన్న మంత్రుల లక్ష్యం కూడా ఒకటే..అదే్ చోటు నిలబెట్టుకోవడం. ఈ క్రమంలో వారి ప్రతిభా ప్రదర్శలు పీక్స్‌కు చేరుతున్నాయి. ఒకరు జగన్ బతికున్నంత కాలం సీఎం అనే గీత పెట్టుకుని పొగడ్తలు కురిపిస్తూంటే.. మరొకరు మళ్లీ సీఎం కాకపోతే నా ఆస్తి మొత్తం రాసిస్తానని సవాళ్లు చేస్తున్నారు. ఇంతకు మించి ఎవరూ ప్రతిభా ప్రదర్శన చేయలేరు అనుకున్న ప్రతీ సారి దాన్ని మించి రెచ్చిపోతున్నారు.
వైసిపి ఎల్పి ప్రకటన అనంతరం ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మంత్రి పదవిని ఆశిస్తున్న వారిలో శ్రీకాకుళం నుంచి స్పీకరు తమ్మినేని సీతారామ్, ధర్మాన ప్రసాదరావు ఉన్నారు. విజయనగరం నుంచి కోలగట్ల వీరభద్రస్వామి, పీడిక రాజన్నదొర ఆశిస్తున్నారు. సామాజిక సమీకరణల్లో తమకు పదవి దక్కుతుందని ఆశతో ఉన్నారు. విశాఖ జిల్లా నుంచి అనకాపల్లి శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్, గిరిజన కోటాలో శెట్టి ఫాల్గుణ, మహిళా కోటాలో భాగలక్ష్మి పదవిని కోరుకుంటున్నారు. వీరంతా ప్రతీ రోజు ఏదో రూపంలో ముఖ్యమంత్రిని పొగడటం.. టీడీపీని తిట్టడం చేస్తున్నారు.
ఇక రోజా లాంటి నేతల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినపనిలేదు. అసెంబ్లీలో వారు చేసిన పద ప్రయోగాలు సరికొత్త రీతిలో ఉంటున్నాయి. ప్రస్తుతం వీరి లక్ష్య ం సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడటమే పనిగా కనిపిస్తోంది. ప్రాంతీయ సామాజిక సమీకరణాలు చూసుకుని చాన్సులు ఉన్నాయనుకున్న వారు మరింత దూకుడుగా ఉంటున్నారు. వీరిలో ఎంత మంది ఆశలు జగన్ నెరవేరుస్తారేమో కానీ.. ఆలస్యమయ్యే కొద్దీ.. ఆశావహులు మాత్రం పెరిగిపోతున్నారు.