ఏపీలో మద్యం బ్రాండ్లపై ప్రపంచంలోఎక్కడ తెలుగు వారున్నా అక్కడ విశేషంగా చెప్పుకుంటారన్నది పాత మాట. ఇప్పుడు ఆ బ్రాండ్లన్నింటికీ “జే బ్రాండ్లు” అని పేరు పెట్టి టీడీపీ ఆందోళన చేస్తోంది. అదంతా చీప్ లిక్కర్ అని.. మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అంటున్నారు. మూడు రోజుల నుంచి ఆందోళనలు ఉద్ధృతం చేశారు. అయితే టీడీపీ ఆందోళనలపై ప్రభుత్వం విచిత్ర వాదన వినిపిస్తోంది. అదేమిటంటే.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఏ ఒక్క డిస్టిలరీకి అనుమతి ఇవ్వలేదట. అంటే.. ఉన్న బ్రాండ్లన్నీ చంద్రబాబు ఉన్నప్పడు అనుమతి ఇచ్చిన డిస్టిలరీలవే అని చెబుతున్నారన్నమాట.
ప్రత్యేకంగా జే బ్రాండ్ల అంశంపై క్లారిటీ ఇవ్వడానికి ఆదివారం అయినప్పటికీ ఏపీ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ మీడియా సమావేశం పెట్టి అదే చెప్పారు. ఏపీలో అమ్ముతున్న బ్రాండ్లలో ఏ డిస్టిలరీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదన్నారు. పైగా అమ్ముతోంది చీప్ లిక్కర్ కాదని తేల్చేశారు. ఏపీలో బ్రాండ్లు దేశంలో ఎక్కడా అమ్మడానికి పర్మిషన్ లేదు. ఫర్ సేల్ ఇన్ ఆంధ్రా ఓన్లీ అనే స్టిక్కర్లు పక్కాగా ఉంటాయి. మూతబడిన డిస్టిలరీలు.. సిక్ అయిన డిస్టిలరీలు.. మరికొన్ని సొంత పార్టీ వాళ్లవి లీజులకు తీసుకుని.. ప్రభుత్వంలోని పెద్దలే ఈ బ్రాండ్లను తయారు చేస్తున్నారని చాలా కాలంగా ఆరోపణలు వస్తున్నాయి. వాటిని కౌంటర్ ఇవ్వడానికి మళ్లీ ఆ బ్రాండ్లను చంద్రబాబు కు అంటగట్టడానికి ఏ మాత్రం మొహమాట పడటం లేదు వైసీపీ నేతలు, అధికారులు.
ఏపీలో పాపులర్ బ్రాండ్లు ఇప్పటికీ లభించడం లేదు. దేశంలో ఎక్కడా అమ్మలేని మద్యాన్ని ఏపీలో అత్యధిక రేటుకు అమ్ముతారు. అదీ కూడా వైసీపీ నేతల డిస్టిలరీల నుంచే కొనుగోలు చేస్తారని అంటున్నారు. పైగా మద్యం దుకాణాల్లో ఆన్ లైన్ పేమెంట్లు లేవు. ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఇన్నీ లొసుగులు మద్యం వ్యాపారంలో ఉంటే.. ప్రభుత్వం అన్ని రాజకీయ అంశాల్లాగే.. చంద్రబాబు పనే అని.. రొటీన్ వాదనతో తప్పించుకునే ప్రయత్నమే చేస్తోంది. కానీ ఈ అంశంపై ప్రజల్లో విస్తృతమైన చర్చకు కారణం అవుతోంది.