జర్నలిస్టుల క్లబ్ రాజకీయాలు ఇతర “మా” ఎన్నికలు.. ఇతర క్లబ్ ఎన్నికలకు ఏ మాత్రం తీసిపోవడం లేదు. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా డ్రామాల మీద డ్రామాలు చోటు చేసుకుంటున్నాయి. గత ఆదివారం పోలింగ్ ముగిసినప్పటికీ రిజల్ట్ ప్రకటించలేకపోయారు. విషయం కోర్టుకు వెళ్లింది. ఓ ప్రెస్ క్లబ్ మెంబర్పై కేసు పెట్టారు. ఓ కోర్టు ఫలితాలు ప్రకటించవద్దని ఆదేశించింది. అయితే కొత్తగా కార్యవర్గం ఎన్నికైనట్లుగా రిటర్నింగ్ అధికారి ప్రకటించేయడంతో కొత్త కార్యవర్గం బాధ్యతలు తీసుకుంది. అయితే.. ఈ ఎన్నిక తీరును ప్రశ్నిస్తున్న ఇతరులు కొత్త కుంపటి పెట్టేసుకున్నారు.
సీనియర్ జర్నలిస్టు సత్యమూర్తి అధ్యక్షతన ప్రెస్క్లబ్లోనే రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పోలింగ్ సమయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి సరిగ్గా ప్రవర్తించలేదని ఈ పోటీ కూటమి తేల్చింది. సభ్యులు కానీ వ్యక్తులను ఓటింగ్, కౌంటింగ్ సమయాల్లో ప్రవేశించడం, గుర్తింపు కార్డు లేకుండానే ప్రెస్ క్లబ్ ఎన్నికల ఓటింగ్ కు అనుమతించచారని వారు ఆరోపిస్తున్నారు. అందుకే సభ్యుల హక్కులను పరిరక్షించడానికి నాన్ కంటెస్టెంట్, సీనియర్ సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని వారికి వారే నిర్ణయించారు.
కొత్తగా వేయబోతున్న కమిటీకి ప్రెస్ క్లబ్ సభ్యుల హక్కుల పరిరక్షణ సమితి అని పేరు పెట్టారు. సభ్యుల హక్కుల పరిరక్షణకు ఈ కమిటీ ఒక రోడ్ మ్యాప్ ను రూపొందించి అమలుచేస్తుందని ప్రకటించారు. ప్రెస్ క్లబ్ ఎన్నికల నిర్వహణలో జరిగిన అవకతవకలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపడం.. సూరజ్ వి. భరద్వాజ్ అనే జర్నలిస్టుపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవడం.. ఎన్నికల ఫలితాలపై కోర్టు ఇచ్చిన స్టే ను అమలు చేయడం అలాగే ఎన్నికలను మళ్లీ రీ షెడ్యూల్ కోసం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే మా తరహాలోనే ఓడిపోయి సభ్యులంతా కొత్త కూటమి పెట్టుకుంటున్నారన్నమాట. జర్నలిస్టులు నీతులు చెబుతారు కానీ.. వారు చేసే రాజకీయాలకు మాత్రం నీతులు వర్తించవని మరోసారి తేలిపోయింది.