మంత్రివర్గ విస్తరణ చుట్టూ ఇప్పుడు ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి. ఆశావహులు కూడా తమవంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. సజ్జల చుట్టూ తిరుగుతూ తమ సంగతి ఏమిటని గుర్తు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో కొంతమందికి సిఎం హామీ ఇచ్చారు. వారు కూడా ఈసారి తమకు కచ్చితంగా పదవి దక్కుతుందనే ఆశతో ఉన్నారు. శ్రీకాకుళం నుంచి స్పీకర్ తమ్మినేని సీతారామ్, ధర్మాన ప్రసాదరావు ఆశలు పెట్టుకున్నారు. విజయనగరం నుంచి కోలగట్ల వీరభద్రస్వామి, పీడిక రాజన్నదొర ఆశిస్తున్నారు. సామాజిక సమీకరణల్లో తమకు పదవి దక్కుతుందని ఆశతో ఉన్నారు.
విశాఖ జిల్లా నుంచి అనకాపల్లి శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ తనకు ఖాయమని నమ్మకంతో ఉన్నారు. తూర్పుగోదావరి నుంచి తుని శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజాకు మంత్రి పదవి ఖాయంగా కనిపిస్తోంది. పశ్చిమగోదావరి నుంచి ముదునూరి ప్రసాదరాజు, భీమవరం నుంచి గ్రంథి శ్రీనివాస్ మంత్రి పదవిని కోరుకుంటున్నారు. కృష్ణా జిల్లా నుంచి కొలుసు పార్థసారధి, సామినేని ఉదయభాను బరిలో ఉన్నారు. వీరిద్దరికీ పదవి ఇవ్వాలంటే పేర్ని నాని, కొడాలి నాని తప్పించాల్సి ఉంటుది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి ఇస్తానని సిఎం హామీ ఇచ్చారు.. దీంతో తనకు బెర్త్ ఉంటుందని ఆయన ఆశతో ఉన్నారు. బాపట్ల నుంచి కోన రఘుపతి, మాచర్ల నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా శలు పెట్టుకున్నారు.
ప్రకాశం జిల్లాలో బాలేనిని కొనసాగనున్నారు. నెల్లూరు నుంచి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, ఎస్సి కోటాలో కిలివేటి సంజీవయ్య మంత్రి పదవిని కోరుకుంటున్నారు. చిత్తూరు జిల్లా నుంచి రోజా వంటి వారు రేసులో ఉన్నారు. అత్యధిక మంది రెడ్డి సామాజికవర్గం వారే పదవులకు పోటీ పడుతున్నారు. సీఎం జగన్ ఈ సారి రెడ్డి కోటాను పెంచుతారో.. లేకపోతే.. అందర్నీ నిరాశ పరుస్తారోనన్న టెన్షన్ వైసీపీలో కనిపిస్తోంది.