మమతా బెనర్జీ చెప్పారు.. మమతా బెనర్జీ చెప్పారు అంటూ వైసీపీ ఎమ్మెల్యే కోరస్‌గా అసెంబ్లీలో పెగసస్ గురించి చెప్పారు. ఆమె మాటల మీదే ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో హౌస్ కమిటీని వేయాలని నిర్ణయించారు. నేడో రేపో సభ్యులను ప్రకటిస్తారు. తర్వాత విచారణ ప్రారంభమవుతుంది. ఏ విచారణ అయినా ముందుగా… ఆ ఆరోపణలు చేసిన వ్యక్తి నుంచి వివరాలు సేకరించడంతో ప్రారంభమవుతుంది. అంటే ఇప్పుడు మమతా బెనర్జీని అసెంబ్లీకి పిలిపించాలి. ఆమె చెప్పారని చెబుతున్న పెగాసస్‌ను చంద్రబాబు ఎప్పుడు కొన్నారు.. ఎలా కొన్నారు..ఎలా వాడారో ఆమె దగ్గర నుంచి తెలుసుకోవాలి.
మమతా బెనర్జీని పిలవకుండా ఆమె చేసిన ఆరోపణలపై విచారణ ప్రారంభిస్తే విలువ ఉండదు. ఎందుకంటే.. అసెంబ్లీలోనే ఈ అంశంపై ఆధారాల్లేవని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నేరుగానే చెప్పారు. అంటే ప్రభుత్వం కొన్నట్లుగా ఎలాంటి ఆధారాల్లేవు. ప్రైవేటుగా ఆ సాఫ్ట్ వేర్ కొనలేరు. మరి ఉన్న ఏకైక ఆధారం మమతా బెనర్జీ. ఆమెను పిలిచించి ప్రశ్నిస్తేనే సభా కమిటీ విచారణ ముందుకు సాగుతుంది. ఆమె దగ్గర వివరాలు తీసుకోకుండా… ఆమె చెప్పిందని చెప్పి చంద్రబాబును పిలిపిస్తాం.. ఏబీవీని పిలిపిస్తాం అంటే… ఆ రాజకీయం రివర్స్ అవుతుంది.
ఏపీ అసెంబ్లీలో వైసీపీ సభ్యులు మాట్లాడుతూంటే వారు అధికారంలో ఉన్నారా ప్రతిపక్షంలో ఉన్నారా అనే డౌట్ చాలా మందికి వచ్చింది. ఎందుకంటే.. వారే విచారణకు డిమాండ్ చేస్తున్నారు. వారే హౌస్ కమిటీకి సిఫార్సు చేసుకున్నారు. వారే సభా సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇదంతా ఎందుకు… ఓ ఆర్టీఏ చట్టం అప్లికేషన్ ద్వారా సామాన్యులకే ప్రభుత్వం సమాచారం ఇస్తోంది.అలాంటిది సీఎం జగన్ అడిగితే అధికారులు చెప్పరా అనేది ఎక్కువ మందికి వచ్చిన డౌట్. ఈ డౌట్ తీరాలంటే హౌస్ కమిటీ మమతా బెనర్జీని విచారణకు పిలవాల్సిందే. కానీ అంత ధైర్యం హౌస్ కమిటీకి ఉంటుందా ?