తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి గంటన్నరకుపైగా ప్రెస్ మీట్ పెట్టి బీజేపీపై విరుచుకుపడ్డారు. ఎప్పుడూ చెప్పే మాటలే చాలా చెప్పినా ముందస్తు ఎన్నికల విషయంలో మాత్రం ఓ స్పష్టతకు వచ్చినట్లుగా చెప్పారు. ఆరు నూరైనా ముందస్తుకు వెళ్లబోమన్నారు. గత ఎన్నికలప్పుడు అవసరం ఉందనే ముందస్తుకు వెళ్లాం. ఇప్పుడు ఆ అవసరం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ఎల్పీ భేటీ తర్వాత మీడియాతో మాట్లాడారు. బీజేపీ పాలనతో దేశం దిగజారిపోయిందని అనేక ఉదాహరణలు చెప్పిన కేసీఆర్..త్వరలో తాను సంచలనం సృష్టించబోతున్నాన్నారు. జాతీయ పార్టీ రావొచ్చని కేసీఆర్ ప్రకటించారు.
దేశంలో మార్పు కోసం ప్రశాంత్ కిషోర్ తన తో ఉన్నారని అందులో తప్పేముందని కేసీఆర్ చెబుతున్నారు. ప్రశాంత్ కిషోర్ వద్ద ఆర్ట్ ఉంది. ప్రజల పల్స్ పట్టుకుంటాడు. ఆయన మాతో కలిసి పని చేస్తున్నారు. ఆయన దేశం కోసం, తెలంగాణ కోసం కూడా పని చేస్తారని ప్రకటించారు. ఏడేళ్లుగా ప్రశాంత్ కిషోర్ తన స్నేహితుడని కేసీఆర్తెలిపారు. ఆయన కిరాయి కోసం పని చేయరని..ఎప్పుడూ ఎవరి వద్ద డబ్బులు తీసుకోలేదని కేసీఆర్ స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాల ప్రభావితం చేయడానికి కేసీఆర్ ముందుకొచ్చాడు కాబట్టి ప్రశాంత్ కిషోర్‌ను కలిశాడన్నారు. ఎవరి వద్ద పీకే డబ్బులు తీసుకోరని కేసీఆర్ కితాబిచ్చారు. ప్రస్తుతం ఓ సర్వే చేయిస్తున్నామని 30 సీట్లలో సర్వే చేయిస్తే ఒక్కటి మాత్రమే మూడు శాతం తేడాతో కోల్పోతున్నామన్నారు. అందుకే అసెంబ్లీ ఎన్నిక్లోల 95- 105 మధ్య సీట్లు గెల్చుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
ధాన్యం కొనుగోలుపై అవసరమైతే ఢిల్లీ వెళ్లి ఉద్యమాలు చేస్తామన్నారు. ఫామ్ హౌస్ మీటింగ్ తర్వాత బయటకు వచ్చిన కార్యాచరణ ప్రకారం ఎలాంటి ఆందోళనలు కేసీఆర్ ప్రకటించలేదు. ఢిల్లీ కూడా వెళ్తున్నట్లుగా చెప్పలేదు. చేతులెత్తి సమస్కరించి ప్రధానిని వేడుకుంటున్నాం. దయచేసి తెలంగాణ ప్రజలతో పెట్టుకోకండని … మీరు మాయామశ్చింద్ర చేస్తామని భ్రమలో ఉండొద్దని ప్రధాని మోదీకి కేసీఆర్ సూచించారు. చినజీయర్‌తో విబేధాలపై మాట్లాడేందుకు కేసీఆర్ నిరాకరించారు.