నువ్వు రెడ్డి..నేను రెడ్డి అని ఉబ్బేయడంతో వైసీపీలో చేరానని చెప్పుకున్న మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డికి ఇప్పుడు అసలు ఊపిరి ఆడటం లేదు. తాను రెడ్డినే అయినా ఆ ఈక్వేషన్ చూపి పార్టీలో చేర్చుకున్నా… తనకు ఎలాంటి పదవి కానీ.. ప్రాదాన్యత కానీ ఇవ్వలేదని బాధపడుతున్న ఆయన ఇప్పుడు.. తన బాధను అసంతృప్తి రూపంలో వ్యక్తంచేస్తున్నారు. రెండు, మూడు రోజులకు ఓసారి మీడియా ముందుకు వచ్చి సీఎం జగన్, సజ్జలపై ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వానికి.., జగన్ ను ఎక్కువగా ఇబ్బంది పెడుతోంది వైఎస్ వివేకా హత్య కేసు. ఈ కేసును టార్గెట్ చేసుకునే ప్రతీ సారి ఆరోపణలు చేస్తున్నారు. ఈ కేసులో జగన్‌కూ లింకుందన్నట్లుగా ఆయన ఆరోపణలు చేస్తున్నారు.
దీంతో సహజంగానే వైసీపీ వ్యతిరేక మీడియాలో.. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కనీసం వచ్చే ఎన్నికల్లో అయినా తనకు పోటీ చేసే చాన్స్ దొరుకుతుందని ఆయన అనుకుంటున్నారు కానీ అలాంటి చాన్సేలేమీ కనిపించకపోవడంతో రెబల్ అయ్యారు. కనీసం ఓ పోస్ట్ అయినా ఇస్తారేమో అనుకున్నారు. అలాంటిది కూడాఏమీ కనిపించకపోవడంతో ఇప్పుడు విమర్శలు ప్రారంభించినట్లుగా కనిపిస్తోంది. అయితే ఆయన రోజువారీ విమర్శలు చేస్తున్నా.. వైసీపీ నేతలెవరూ పట్టించుకోవడం లేదు. కనీసం ఇప్పుడైనా కాస్త పట్టించుకుని ఏదో ఓ నామినేటెడ్ పోస్ట్ ఇస్తే ఆయన సర్దుకుంటాడని.. వ్యతిరేక ప్రచారం జరగకుండా ఉంటుందని కడప వైసీపీ నేతలు కొంత మంది హైకమాండ్‌కు చెబుతున్నారు.
అయితే అక్కడ కూడా ఎక్కువ మంది డీఎల్ రవీంద్రారెడ్డిని వ్యతిరేకిస్తున్నారు. ఆయనకు ఎమ్మెల్సీ లేకపోతే రాజ్యసభ సీటు ఇచ్చి సైలెంట్ చేస్తే మంచిదని సలహాలు సజ్జలకు వెళ్తున్నాయి. ఎందుకంటే సజ్జలే. రెడ్డి సెంటిమెంట్‌తో చర్చలు జరిపి ఆయనను పార్టీలోకి తెచ్చారు. ఇప్పుడు ఆ రెడ్డి సెంటిమెంట్‌ను సైతం కాదని డీఎల్ విమర్శలు చేస్తున్నారు. డీఎల్‌ను ఎలా కంట్రోల్ చేస్తారో కానీ లేకపోతే.. తనరాజకీయ అనుభవాన్ని మొత్తం ఉపయోగించి.. డీఎల్ మరింత రచ్చ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.