ప్రశాంత్ కిషోర్ దగ్గర ఆర్ట్ ఉంది. ఆయన ప్రజల పల్స్ పట్టుకుంటారు. ఒక్క రూపాయి తీసుకోకుండా ఫ్రీగా పని చేస్తారు.. అని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పీకేకు సర్టిఫికెట్ ఇచ్చారు. ఆయన దగ్గర ఉన్న ఆర్ట్ గురించి అందరికీ తెలుసు. అయన రాజకీయ నాయకుల్ని ఎలా ఆర్టిస్టుల్ని చేస్తారో కూడా అందరికీ తెలుసు. అంత వరకూ బాగానే ఉన్నా.. పీకే ఫ్రీగా పని చేస్తారు అని కేసీఆర్ చెప్పిన మాటే చాలా మందికి ఆశ్చర్యకరంగా మారింది. ఎందుకంటే పీకే సేవలు పొందాలంటే వందల కోట్లలో చెల్లించుకోవాలనేది ఇప్పటి వరకూ వినిపిస్తున్నమాట. కానీ ఇప్పుడు ఆయన సేవలు ఉచితమేనని కేసీఆర్ చెబుతున్నారు.
పీకే వ్యూహాలు అంటే.. అంతా సోషల్ మీడియా, సర్వేల ద్వారా సాగుతుంది. ఆయన సంస్థ ఐ ప్యాక్. ఆయన పని చేయడం అంటే ఐ ప్యాక్ పని చేయడం అన్నమాట. మరి ఏ డబ్బులూ తీసుకోకుండా ఈ సంస్థను పీకే ఎలా నడుపుతున్నాడన్నది అందరికీ వచ్చే డౌట్. వైసీపీకి ఉచితంగా చేశారని కేసీఆర్ అన్నారు.. కానీ ఐప్యాక్‌కు రూ. 37 కోట్లు ఇచ్చామని వైసీపీ తన అధికారిక లెక్కల్లో వివరించింది. ఇది అధికారికం మాత్రమే. అనధికారికంగా సోషల్ మీడియా ప్రచారాల కోసం.. క్షేత్ర స్థాయి ప్రచారం కోసం… ఐ ప్యాక్ సిబ్బంది టూర్ల కోసం వందల కోట్లు వెచ్చించారన్న ప్రచారం ఉది. అయితే అవన్నీ పార్టీ ఖాతాలోకి రావు. వేర్వేరు లెక్కల ద్వారా సెటిల్ చేస్తారు.
ఎన్ని పార్టీలకూ చేసినా అదే పరిస్థితి. పీకేతో పెట్టుకుంటే.. డీల్స్ అన్నీ వందల కోట్లలోనే ఉంటాయి. అది బీహార్ అయినా అంతే అనేది రాజకీయ పార్టీల్లోని అందరికీ తెలిసిన విషయం. అయితే కేసీఆర్ ఆయనేదో రాజకీయ పార్టీలకు ఉచితంగా సేవ చేస్తున్నారని చెప్పడమే అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. టీఆర్ఎస్ కూడా అన్ని వందల కోట్లు ఎలా ఖర్చు పెడుతుందనే విమర్శలు వస్తాయనే కేసీఆర్… పీకేకు ఫ్రీ ట్యాగ్ ఇచ్చారని భావిస్తున్నారు. అందరూ అదే నమ్ముతున్నారు. ఎందుకంటే..ఎవరూ ..ఉచితంగా పని చేయరు. ఏ వస్తువూ ఉచితంగా రాదు. పైగా అత్యంత అమూల్యమైనవిగా మారిన పీకే సేవలు … అసలు రావు మరి !