చిరంజీవి కెరీర్‌లోని ఉత్తమ చిత్రాల్లో `ఠాగూర్` ఒకటి. అటు సందేశాన్నీ, ఇటు కమర్షియల్ అంశాల్నీ బాగా మిక్స్ చేసిన సినిమా అది. రీమేకే కావొచ్చు గానీ, చిరు కెరీర్లో గుర్తుండిపోయే సినిమాగా మిగిలిపోయింది. ఆ తరవాత అదే దారిలో `స్టాలిన్` చేసినా ఫలితం రాలేదు. ఆ తరవాత చిరు సందేశాల జోలికి వెళ్లలేదు. అయితే ఇప్పుడు `ఠాగూర్`లాంటి మరో కథ దొరికింది. వెంకీ కుడుముల దర్శకత్వంలో చిరు ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. డి.వి.వి దానయ్య నిర్మాత. ఇది `ఠాగూర్` టైపు కథని తెలుస్తోంది. బలమైన సందేశాన్ని ఫక్తు కమర్షియల్ విషయాలతో చెబుతూ స్క్రిప్టు రెడీ చేశాడట వెంకీ కుడుముల. జూన్‌లో ఈ సినిమాని లాంఛనంగా ప్రారంభించనున్నారు. జులైలో షూటింగ్ మొదలు కానుంది. ప్రస్తుతం చిరంజీవి చేతిలో మూడు సినిమాలున్నాయి. ‘భోళా శంకర్’, ‘గాడ్ ఫాదర్’, ‘వాల్తేరు వీరయ్య’ సెట్స్‌పై ఉన్నాయి. ‘భోళా శంకర్’, ‘గాడ్ ఫాదర్’ జులై నాటికి ముగింపుకు వచ్చేస్తాయి. అందుకే వెంకీ కుడుముల సినిమాని జులైలో మొదలెట్టాలని భావిస్తున్నారు.