పార్టీ నేతలకు నామినేటెడ్ పోస్టులు కట్టబెట్టాలని ఎంతో ఉత్సాహంగా ఉన్న ఏపీ ప్రభుత్వానికి నియమ, నిబంధనలేమీ కనిపించలేదు. అందరికీ పదవులు పంచేసింది. ఇప్పుడు ఆ పదవులు భర్తీ చేయడం సాధ్యం కాదని.. అలాంటి పదవులు లేవని..న్యాయపరమైన చిక్కులు వస్తాయని తెలియడంతో హడావుడిగా అందరితో రాజీనామా చేయిస్తోంది. ఆ పదవులు స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ పదవులు. పదవుల నియామకాల్లో సాంకేతిక సమస్యలు ఏర్పడటంతో రాజీనామా చేయాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు అందరూ వరుసగా రాజీనామాలు చేస్తున్నారు.
ప్రభుత్వమే పదవులు ఇవ్వడంతో అధికారులు కూడా కిమ్మనకుండా వారి కింద పనిచేస్తున్నారు. పదవులు పొందిన వారంతా స్మార్ట సిటీ కార్పొరేషన్లలో సమీక్షలు కూడా ప్రారంభించారు. వాస్తవానికి స్మార్ట్ సిటీ కార్పొరేషన్లకు కలెక్టర్ లేదా మున్సిపల్ కమిషనర్ మాత్రమే చైర్మన్గా ఉండాలి. అవి రాజకీయ పదవులు కాదు. అయినా ప్రభుత్వం రాజకీయ పదవులుగా పంపిణీ చేసింది. వారు విధులు కూడా నిర్వహిస్తున్నారు. ఏపీలో కేంద్రం కొన్నింటిని స్మార్ట్ సిటీలుగా ప్రకటించగా.. రాష్ట్రం సొంతంగా మరికొన్ని స్మార్ట్ సిటీలను ప్రకటించింది.
వీటి పనితీరుపై కేద్రానికి సమాచారం వెళ్లడం.. పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా అందడంతో స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ పదవులకు చట్టబద్ధత లేదని కేంద్రం నుంచి స్పష్టమైన ఆదే్శాలు పంపింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్లు అందరూ రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందిని సమాచారం పంపింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీకావడంతో చైర్మన్ల పదవి మూన్నాళ్ల ముచ్చటగా మారిపోయింది.