ప్రభుత్వానికి ఎవరో లిక్కర్ సరఫరా చేస్తున్నారు. ఆ లిక్కర్‌ను ప్రభుత్వం ప్రజలకు అమ్ముతోంది. ఆ లిక్కర్ ప్రమాదకరమని ధర్డ్ పార్టీ వ్యక్తులు ల్యాబుల్లో టెస్టులు చేయించి రిపోర్టులు ప్రజల్లోకి విడుదల చేశారు. అప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి ? ఆ లిక్కర్ కంపెనీలను వివరణ అడగాలి. లేకపోతే తానే స్వయంగా టెస్టులు చేయించాలి. ప్రపంచ స్థాయి ప్రమాణాలు ఉన్న ల్యాబుల్లో టెస్టులు చేయించి.. మంచిదో కాదో ప్రజలకు భరోసా ఇవ్వాలి. మంచిదయితే ఆ విషయం తాగే వాళ్లకు చెప్పాలి. లేకపోతే సరఫరా చేస్తున్న మద్యం కంపెనీలపై కేసులు పెట్టాలి. కానీ ఏపీలో జరుగుతోంది వేరు.
లిక్కర్‌ను ప్రభుత్వం ఎందుకు టెస్ట్ చేయించడం లేదు ?
ఏపీ ప్రభుత్వానికి చిత్రవిచిత్రమైన బ్రాండ్ల పేర్లతో మద్యం కంపెనీలు ప్రభుత్వానికి సరఫరా చేస్తున్నాయి. ప్రభుత్వం ప్రజలకు అమ్ముతోంది. ఏటా రూ. పద్దెనిమిది వేల కోట్ల వరకూ ఆదాయం లెక్కలేసుకుంది. ఆ బ్రాండ్ల వల్ల ప్రజల ఆరోగ్యానికి హానికరం అంటూ వివిద ల్యాబుల్లో వచ్చిన టెస్టు రిపోర్టులను పలువురు బయట పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి… అర్జంట్‌గా ఆ లిక్కర్‌ను తాము అయినా టెస్ట్ చేయించాలి.. లేకపోతే.. కొనుగోలు నిలిపివేయాలి. కానీ ప్రభుత్వం తాము స్వయంగా టెస్ట్ చేయించదు.. కొనుగోలు నిలిపివేయదు. కానీ ఆ టెస్టులు చేయించిన వారిపై ఎదురుదాడి ప్రారంభించింది.
కంపెనీలను సమర్థిస్తూ ప్రభుత్వం వాదన చేయడమేంటి ?
ఏపీ ప్రభుత్వానికి మద్యం అమ్ముతున్న కంపెనీలకు మద్దతుగా ప్రభుత్వమే రంగంలోకి దిగింది. ఎక్సైజ్ శాఖ కార్యదర్శి రజత్ భార్గవ.. టెస్టులు చేయించిన రఘురామపై కేసులు పెడతామని.. పరువు నష్టం వేస్తామని మీడియా ముందుకు వచ్చి హెచ్చరిస్తున్నారు. ఆయనతో పాటు ఓ ప్రభుత్వ టెస్టింగ్ ల్యాబ్ అధికారణిని కూడా మీడియా ముందుకు వచ్చారు. ఆమె మరీ విచిత్రమైన వాదన తీసుకొచ్చారు. మంచి నీళ్లు కూడా ప్రమాదకరమేనని వాదన తీసుకొచ్చారు. ఇంత అడ్డగోలుగా ఆ కంపెనీలను ప్రభుత్వం ఎందుకు వెనకేసుకొస్తుందో చూసే వారికీ అంతుబట్టని విషయం.
లిక్కర్ కంపెనీలు ప్రభుత్వ పెద్దలవనేదానికి ఇదే సాక్ష్యమా ?
ఏపీ ప్రభుత్వానికి లిక్కర్ సరఫరా చేస్తున్న కంపెనీలు ప్రభుత్వ పెద్దలవనేనని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దానికి తగ్గట్లుగానే .. దానికి సాక్ష్యం అన్నట్లుగా మద్యం కంపెనీలను.. లిక్కర్ బ్రాండ్లను వెనకేసుకు వచ్చేందుకు ప్రభుత్వ ఉన్నతాధికారులు తాపత్రయ పడుతున్నారు. ఆరోపణలు వస్తున్న ప్రైవేటు కంపెనీల మద్యం కంపెనీలపై మరకలు పడకుండా ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటోంది. ఆ లిక్కర్ బ్రాండ్లు ఎవరివో జనానికి తెలియడానికి ఈ చిన్న లాజిక్ ప్రజలకు అర్థం కాదా ?