ఏపీలో పన్నుల వసూలు తీరు ప్రజలను అసహనానికి గురి చేస్తోంది. సామాన్యుల దగ్గర నుంచి రూ. వంద, రెండు వందల చెత్త పన్ను వసూలు చేయడానికి… రూ. వెయ్యిఆస్తి పన్ను వసూలు చేయడానికి దారుణమైన పద్దతులకు పాల్పడుతున్న అధికారులు వైసీపీ నేతలు కట్టాల్సిన రూ. లక్షల పన్నును మాఫీ చేస్తున్నారు. ఈ విషయాలు బయటకు వస్తున్నకొద్దీ ప్రజల్లో చర్చనీయాంశమవుతున్నాయి. పేదలను మాత్రమే పిండుకుంటారా..? కుబేరులైనా వైసీపీ నేతలకు మినహాయింపులిస్తారా అన్న చర్చ ప్రజల్లో జరుగుతోంది.
తూ.గో జిల్లాలో ఇటీవలి కాలంలో పేదలు ఇంటి పన్ను, చెత్త పన్ను కట్టడం లేదని ఇళ్లకు తాళాలేయడం, సీజ్ చేయడం నీటి కుళాయి కనెక్షన్లు తొలగించడం వంటివి చేస్తున్నారు. దీంతో ప్రజలు నానా తిప్పలు పడి.. అప్పులు చేసి పన్నులు కట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో తూగో జిల్లాలోనే కాకినాడలో వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఏకంగా రూ. పది లక్షల పన్ను మినహాయింపును ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. చాలా కాలంగా పన్ను కట్టని ఆయన ఇప్పుడు తన ఆస్తులపై ఆదాయం లేదన్న కారణంగా పన్ను మినహాయింపు కోరారు. ఆయన కోరడమే ఆలస్యం అన్నట్లుగా మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ద్వారంపూడికి కాకినాడలో గోడౌన్లు ఉన్నాయి. తానే ప్రభుత్వం అనుకునే ఆయన.. పన్నులు కట్టాల్సిన అవసరం ఏమిటని.. కట్టరు. ఇప్పుడు అదే నిజం చేసుకుని మినహాయింపు పొందారు. గోడౌన్లు ఖాళీగా ఉన్నాయని కారణం చెప్పారు. తము రూ. వంద కట్టకపోతేనే పరువు తీస్తున్న ప్రభుత్వం.. తమ ఎమ్మెల్యేకు మాత్రం ఇలా లక్షల్లో మినహాయింపులు ఇవ్వడం ఏమిటనేది ప్రజల ఆవేదన. కానీ ప్రజలు బయటకు చెప్పుకోలేరు. అలా చెప్పకుంటే ఏం జరుగుతుందో వారికి తెలుసు.