చంద్రబాబు అవసరం ఉన్నా లేకపోయినా రోజూ మీడియా సమావేశాలు పెట్టి ప్రభుత్వం విరుచుకుపడేవారు. ప్రభుత్వం చేసిన తప్పులన్నింటినీ తానే బయటపెట్టాలనుకునేవారు. కానీ కొద్ది రోజులుగా ఆయన మీడియా సమావేశాలు పెట్టడం లేదు. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా గంటా.. గంటన్నర మాట్లాడేవారు. ఆయన ప్రెస్ మీట్లు అంటే జర్నలిస్టులే బోర్ ఫీలయ్యే పరిస్థితి. వీటిపై ఆయనకు చాలా సార్లు ఫీడ్ బ్యాక్ వచ్చినా మార్చుకోలేకపోయారు. కానీ హఠాత్తుగా ఆయన తనను తాను మీడియాకు దూరంగా ఉంచుకుంటున్నారు. దీంతో తేడా కనిపిస్తోంది.
సీఎం జగన్ తెలుగు మీడియాతో ఇంతవరకూ ఒక్క సారి ఇంటరియాక్షన్ కాలేదు. నేరుగా ప్రెస్ మీట్ పెట్టలేదు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఆయన మీడియాతో నేరుగా కలిసేది తక్కువ. ఏదైనా ఉన్నా..అనుకూల మీడియాను మాత్రమే రానిస్తారు. ఇబ్బందికర ప్రశ్నలు ఎదురు కాకుండా చూసుకుంటారు. కానీ టీడీపీ ప్రెస్ మీట్లలో అలాంటిదేమీ ఉండదు. సాక్షి రిపోర్టర్ నేరుగా సీఎంగా ఉన్న చంద్రబాబుతోనే వాగ్వాదానికి దిగిన సందర్భాలు ఉన్నాయి. చంద్రబాబు ప్రెస్ మీట్లను చూసి ఓసందర్భంగా అవసరం లేకపోయినా మాట్లాడే ప్రతిపక్ష నేత.. అవసరం ఉన్నా మాట్లాడని సీఎంగా సెటైర్లు వినిపించాయి. ఇప్పుడు చంద్రబాబు తన స్టైల్‌ను మార్చుకున్నారు.
రోజూ మాట్లాడితే విలువ ఉండదు. ఎప్పుడో ఓ సారి ప్రెస్‌మీట్ పెడితేనే మీడియా అటెన్షన్ వస్తుంది. ప్రజలు కూడా రోజూ మాట్లాడే విషయమే కదా అనుకోవడానికి అవకాశం ఉండదు. పైగా ఈ ప్రెస్మీట్లకు పెట్టే సమయాన్ని పార్టీ కోసం కేటాయించవచ్చు. చంద్రబాబు ఇప్పుడు అదే చేస్తున్నారు. మీడియాతో మాట్లాడటం కన్నా.. పార్టీ కోసం… పనులు చక్కబెట్టుకుంటున్నారు. నియోజకవర్గాల్లో పరిస్థితులపై వస్తున్న రిపోర్టుల ఆధారంగా కరెక్షన్స్ చేసుకుంటున్నారు. దీంతో చంద్రబాబు ఎందుకు మీడియా ముందుకు రావడం లేదన్న ఆసక్తి వైసీపీ నేతల్లో కనిపిస్తోంది. అదే విషయాన్ని సవాళ్ల రూపంలో టీడీపీ నేతల మీదకు వదులుతున్నారు.
చంద్రబాబు పార్టీ నేతలను ఎప్పుడూ కలుస్తూ ఉంటారు. అలా కలిస్తే చాలని.. మీడియా ముందుకు రావనవసరం లేదని ఎక్కువ మంది టీడీపీ నేతల అభిప్రాయం. ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నమ్ముతుతున్నారు. ఇప్పటికైతే చంద్రబాబు అదే పాటిస్తున్నారు.