తెలంగాణలో టీఆర్ఎస్ కోసం పని ప్రారంభించిన ప్రశాంత్ కిషోర్‌కు నమ్మకమైన వ్యక్తుల్ని ఎంచుకోవడం కష్టంగా మారింది. ఇటీవల ఆయన తెలంగాణలో పని చేసేందుకు ..రిక్రూట్‌మెంట్ ప్రారంభించారు. ఐ ప్యాక్ సంస్థ పేరుతో స్వయంగా ప్రశాంత్ కిషోర్ బొమ్మతోనే పని చేసేందుకు యువతను ఆహ్వానిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రచార సరళిని పూర్తిగా మార్చివేయడంతో పాటు, ఎన్నికల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రశాంత్ కిశోర్ పని చేస్తున్నారు. ఇలా చేయాలంటే క్షేత్ర స్థాయి సమాచారం చాలా కీలకం.అందుకే యువతను తమ సంస్థలో చేరాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్రమంతటా ఐప్యాక్‌తో కలిసి రాజకీయ ప్రచార అనుభవాన్ని పొందాలని సూచించారు. అంతేగాక, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై శిక్షణ ఇచ్చి, ప్రచారాన్ని ముందుకు నడిపించే బాధ్యతలను ఐ-పీఏసీలో చేరిన యువతపై ప్రశాంత్ కిషోర్ పెట్టనున్నారు. అయితే ప్రశాంత్ కిషోర్ టీంలోకి ఇదేఅదనుగా కాంగ్రెస్, బీజేపీ నేతలు తమ కార్యకర్తలను చొప్పిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఐ ప్యాక్‌లో చేరేందుకు ఇచ్చిన పిలుపుపైగుట్టుగా తమ యువ కార్యకర్తలను పపుతున్నారు. కొంత మంది సెలక్ట్ అయినట్లుగా తెలుస్తోంది.
వారి ద్వారా కీలకమైన సమాచారం తెలుసుకుంటే చాలని.. కాంగ్రెస్, బీజేపీ భావిస్తున్నాయి. పీకే కార్పొరేట్ రాజకీయం చేస్తారు. అయితే నిజంగా రాజకీయ నేతలు అంతకుమించిన స్ట్రాటజీల్ని పాటిస్తారు. బీజేపీ,కాంగ్రెస్ కార్యకర్తల్ని ఏరివేయగిలిగితే పీకే సక్సెస్ అవుతారు. లేకపోతే.. ఇరుక్కుపోయినట్లుగా అవుతుందని భావిస్తున్నారు.