రానా – సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం విరాట పర్వం. వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. చిత్రీకరణ ఎప్పుడో పూర్తయ్యింది. కానీ విడుదలకు మాత్రం పరిస్థితులు అనుకూలించడం లేదు. కరోనా వల్ల సినిమా కొంతకాలం ఆలస్యమైంది. కొంత మేర రీషూట్లూ జరిగాయి. ఇప్పుడు అన్నీ సర్దుకున్నాయి. అయితే నిర్మాత సురేష్ బాబు మాత్రం ఈ సినిమాని ఓటీటీకి ఇచ్చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. నెట్ ఫ్లిక్స్, అమేజాన్ నుంచి మంచి డీల్స్ కూడా వచ్చాయి. నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమాని రూ.42 కోట్లకు కొనడానికి ముందుకొచ్చిందని సమాచారం. శాటిలైట్ హక్కుల రూపంలో మరో ఏడెనిమిది కోట్లు గ్యారెంటీగా వస్తాయి. ఎలా చూసినా విరాటపర్వం 50 కోట్ల సినిమా. అందుకే సురేష్ బాబు కూడా ఎలాంటి రిస్కూ లేకుండా ఈ సినిమాని ఓటీటీకి ఇచ్చేయాలని డిసైడ్ అయినట్టు టాక్. సురేష్ ప్రొడక్షన్స్ నుంచి ఈమధ్య వచ్చిన సినిమాలు ఓటీటీకే వెళ్లాయి. `నారప్ప` మంచి లాభాల్ని తీసుకొచ్చింది కూడా. కాకపోతే.. రానాకి సోలో హిట్ ఇవ్వాలన్నది సురేష్ బాబు తాపత్రయం. అదొక్కటే ఆయన్ని వెనక్కి లాగుతోంది. ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయి, బాగా ఆడితే రానాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. రానా కూడా `ఈ సినిమాని థియేటర్లోనే విడుదల చేద్దాం` అంటున్నాడట. అందుకే ఓటీటీ విషయంలో సురేష్ బాబు ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నాడు. రూ.42 కోట్ల డీల్ అయితే టెమ్టింగ్ గానే ఉంది. ఎమోషన్ కంటే, ప్రాఫిట్ల గురించే ఎక్కువ ఆలోచించే సురేష్ బాబు ఈసారి ఎలాంటి నిర్ణయం తీసుకొంటారో చూడాలి.