మరికొద్ది గంటల్లో `ఆర్.ఆర్.ఆర్` బొమ్మ పడిపోతోంది. ఎన్నాళ్ల నిరీక్షణకు తెర పడబోతోంది. తొలి మూడు రోజులూ టాక్ తో పనిలేదు. రికార్డులు బద్దలైపోవడం ఖాయం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. ఇప్పటికే అడ్వాన్సు బుకింగులతో హోరెత్తిపోతోంది. శుక్రవారం టాలీవుడ్ కొత్త రికార్డు చూడడం.. లాంఛన ప్రాయమే. అయితే… ఆర్.ఆర్.ఆర్తో థియేటర్ యజమానులు, మేనేజర్లు, డిస్ట్రిబ్యూటర్లకు కొత్త సమస్య మొదలైంది. సాధారణంగా ఏ పెద్ద సినిమా వచ్చినా `మాకు టికెట్లు కావాలి` అంటూ థియేటర్ యజమానులకు, ఆ థియేటర్ కి సంబంధించిన మేనేజర్ కో కాల్ చేయడం మామూలే. `ఆర్.ఆర్.ఆర్`కీ ఇదే తంతు. కాకపోతే… ఈ గోల పీక్స్‌లో ఉంది.
హైదరాబాద్‌లోని ఓమల్టీప్లెక్స్ అది. నాలుగు రోజుల నుంచీ.. ఆ మల్టీప్లెక్స్‌కి ఎవరో ఒకరు వీఐపీ పేరు చెప్పి వస్తూనే ఉన్నారు. పది టికెట్లు కావాలి.. ఇరవై కావాలి.. అని డిమాండ్ చేసి మరీ పట్టుకెళ్లిపోతున్నారు. `మేం ఫలానా మంత్రి తరపు నుంచి.. మేం ఫలానా పోలీస్ ఆఫసర్ తరపు నుంచి` అని రికమెండేషన్లు, డిమాండ్లు. అంతేనా? `మాకు టికెట్ ఇవ్వకపోతే… ఈ మల్టీప్లెక్స్ ఉంటుందా` అంటూ రుబాబులు. ఇవన్నీ తట్టుకోలేక.. ఆ మల్టీప్లెక్స్ మేనేజర్ బిపీ వచ్చి పడిపోయాడట. ఇప్పుడు ఆసుపత్రిలో చేర్చారు. ఇది ఒక్క మల్టీప్లెక్స్ కథే. ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయో..? ఈ సినిమాకి పనిచేసిన ప్రధాన టెక్నీషియన్లకు సైతం టికెట్లు దొరకని పరిస్థితి ఉంది. ఒక్కో టెక్నీషియన్‌కి విధిగా నిర్మాత 10 టికెట్లు మాత్రమే పంపగలిగారు. అయితే ఆయా టెక్నీషియన్ల నుంచి 100 టికెట్ల వరకూ డిమాండ్ ఉంది. టికెట్లు అడుగుతారన్న భయంతో చాలామంది ఫోన్లు బంద్ చేసుకుంటున్నారు. `బాహుబలి` సమయంలో ఇలాంటి ఫీవర్ చూశాం. మళ్లీ ఇన్నాళ్లకు. రాజమౌళి సినిమానా.. మజానాకా.?