టాలీవుడ్ డ్రగ్స్ కేసు ముగిసిపోయిందనుకున్నారు కానీ.. నిను వీడని నేనే అన్నట్లుగా వెంట పడుతోంది. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అదే పనిగా డ్రగ్స్ కేసును ఫాలో అప్ చేసుకుంటున్నారు. ఇటీవల కోర్టు నుంచి ఈడీకి పూర్తి వివరాలు ఇవ్వాలనే ఆదేశాలు తెలంగాణ పోలీసులకు వెళ్లాయి. కానీ పోలీసులు ఇవ్వడం లేదు. ఎన్ని సార్లు అడిగినా ఇవ్వకపోవడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఈడీ కోరిన వివరాలు ఇవ్వాలని ఫిబ్రవరి 2న ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నిందితులు, సాక్షుల డిజిటల్ డేటా ఇవ్వాలని ఫిబ్రవరి 8న ఎక్సైజ్ శాఖకు ఈడీ లేఖ రాసింది. అయితే ఇవ్వలేదు.
హైకోర్టు ఆదేశించినా డ్రగ్స్ కేసు డిజిటల్ డేటా ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ పేర్లను పేర్కొంటూ హైకోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. వివరాలు లేకపోవడంతో కేసు దర్యాప్తుపై ప్రభావం చూపుతోందని ఈడీ పేర్కొంది. సోమేశ్‌కుమార్, సర్ఫరాజ్ అహ్మద్‌కు నోటీసులు పంపించారు. కోర్టు ధిక్కరణకు పాల్పడి మరీ ఎందుకు.. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సాక్ష్యాల్ని దాచి పెడుతున్నారన్నది చాలా మందికి అర్థం కావడం లేదు. గతంలో ఈడీ దర్యాప్తు చేసినప్పుడుతెలంగాణ ప్రభుత్వం ఎలాంటి వివరాలు ఇవ్వలేదు.
దాంతో ఈడీ ఏమీ చేయలేకపోయారు. ఈడీ కేసు విచారణ జరుగుతున్నప్పుడు సినీ ప్రముఖుల డ్రగ్స్ కేసులో ఆధారాల్లేవని కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది ఎక్సైజ్ శాఖ. ఈ పరిణామాలన్నీ చూస్తూంటే… తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా టాలీవుడ్‌ను డ్రగ్స్ కేసులో కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లుగా భావిస్తున్నారు. అయితే ఈడీ నుంచి ఎంత కాలం ప్రభుత్వం ఇలా టాలీవుడ్ ను కాపాడగలగదన్నదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది.