`ఆర్.ఆర్.ఆర్` ప్రచారం జోరుగా సాగుతోంది. ఏ టీవీ చూసినా.. రాజమౌళి, చరణ్, తారక్లే కనిపిస్తున్నారు. వాళ్ల మాటలే వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఓ అరడజను రికార్డెడ్ ఇంటర్వ్యూలు చేసి, ఎలక్ట్రానిక్ మీడియాకు ఇచ్చేసింది చిత్రబృందం. ప్రింట్ మీడియాని మాత్రం పట్టించుకోలేదు. అసలు ఏ ఒక్క పేపర్కీ స్పెషల్ ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. `బాహుబలి` టైమ్ లో `ఈనాడు`పై స్పెషల్ ఇంట్రస్ట్ తో పేజీల కొద్దీ ఇంటర్వ్యూలు ఇచ్చి, ఇప్పించిన రాజమౌళి.. ఇప్పుడు ఈనాడుతో సహా ఏ పేపర్ నీ పట్టించుకోలేదు.
టీవీ ఛానళ్లకు కూడా తాము చేసిన ఇంటర్వ్యూలు ఇచ్చారు గానీ, ఎవ్వరినీ దగ్గరకు రానివ్వలేదు. చివరి నిమిషాల్లో బాగోదని, నాలుగు టీవీ ఛానళ్లని పిలిచి. ముఖాముఖిలు ఇచ్చి, `మ…మ` అనిపించారు. నిజానికి అప్పటికే ఈ సినిమా గురించి అంతా మాట్లాడేశారు కాబట్టి, ఆ టీవీ ఇంటర్వ్యూలు కూడా చప్పగానే అనిపించాయి. ప్రింట్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వకపోవడమే కాదు. కనీసం వాళ్లకు రెగ్యులర్ గా ఇచ్చే యాడ్లు కూడా ఇవ్వలేదు. రాజమౌళి ముందు నుంచీ యాడ్లపై ఖర్చు పెట్టడానికి వ్యతిరేకి. బాహుబలికి కూడా ఆయన యాడ్లు ఇవ్వలేదు. ఇప్పటికే కావల్సినంత ప్రచారం వచ్చేసింది, ఇక డబ్బులు పెట్టి ప్రచారం చేసుకోవడం ఎందుకనేది ఆయన స్ట్రాటజీ కావొచ్చు. కాకపోతే ఈ విషయంలో.. ప్రింట్ మీడియా మాత్రం కాస్త గుర్రుగానే వుంది.