మారుతి – ప్రభాస్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. కథ ఎప్పుడో ప్రభాస్‌కి వినిపించేశారు. ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు. ఈ కథని పూర్తి స్థాయిలో తీర్చిదిద్దుతున్నాడు మారుతి. ఇదో ఫ్యామిలీ ఎంటర్టైనరని, లేదు.. ఇదో హారర్ సినిమా అని బయట వార్తలొస్తున్నాయి. మారుతి మాత్రం ఈ విషయంలో నోరు మెదపడం లేదు.`అన్నీ ఒకదాని తరవాత ఒకటి బయట పడతాయి.. అంత వరకూ ఓపిక పట్టండి` అని చెబుతూనే ఉన్నారు. అయితే.. ఈ సినిమాకి సంబంధించి వార్తలు ఆగడం లేదు.
ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. ఇదో హారర్ కామెడీ చిత్రమని, బొమన్ ఈ సినిమాలో దెయ్యంగా కనిపిస్తారని, ఓ ఇంటి చుట్టూ కథ నడుస్తుందని, ఆ ఇంట్లోకి చిత్ర విచిత్రమైన పరిస్థితుల్లో హీరో చేరతాడని, ఆ తరవాత ఏమైందన్నదే కథని తెలుస్తోంది. కామెడీ సినిమాలు తీయడంలో మారుతి దిట్ట. ఆయన హారర్ కామెడీ కూడా తీశారు. ఈ జోనర్లో `ప్రేమకథా చిత్రమ్` అతి పెద్ద హిట్. ఈసారీ ప్రభాస్ కోసం మారుతి అదే జోనర్ ని ఎంచుకున్నారని సమాచారం.