వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజును ఎలాగైనా ఫిక్స్ చేయాలన్న ప్రయత్నాలను విజయసాయిరెడ్డి మానుకోలేదు. ఆయన మరోసారి సీబీఐకి సవివరమైన లేఖతో … రఘురామకృష్ణరాజు బ్యాంకులను మోసం చేశారని ఫిర్యాదు చేశారు. ఆయన పది బ్యాంకుల వద్ద రూ. 1004 కోట్ల రుణాలు తీసుకుని ఎగ్గొట్టారని లెక్కలు చెప్పారు. తక్షణం ఆయన వద్ద నుంచి ఆ నగదును రికవరీచేయాలని కోరారు. రఘురామ ఇండ్ భారత్ పేరుతో కంపెనీలు పెట్టి వాటి పేరు మీద రుణాలు తీసుకున్నారన్నారు. నిజానికి రఘురామపై రుణాలు ఎగ్గొట్టిన కేసులు ఇప్పటికే సీబీఐ వద్ద ఉన్నాయి. ఆయనపై విచారణ కూడా జరుగుతోంది.
అలాగే కొన్ని కేసులు ఎన్సీఎల్టీలో కూడా ఉన్నాయి. అయితే కొత్తగా ఇప్పుడు విజయసాయిరెడ్డి సీబీఐకి ఎందుకు ఫిర్యాదు చేశారనేది కొంచెం సస్పెన్స్ గానే ఉంది. సీబీఐ ఆఫీసులో ఫిర్యాదు చేయడానికి ముందే విజయసాయిరెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. ఏపీకి సంబంధించిన పలు అంశాలపై కలిసినట్లుగా చెప్పారు. బహుశా..ఆ భేటీలో రఘురామ అంశాన్ని కూడా ప్రస్తావించి ఉంటారని భావిస్తున్నారు. రఘురామ ఫిర్యాదుపై సీబీఐ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేదానిపై కేంద్రం ఆలోచనలు ఎలా ఉన్నాయనేది ఆధారపడి ఉంటుందని అనుకోవచ్చు. నిజానికి ఇప్పటికే జరుగుతున్న కేసుల మీద ప్రత్యేకంగా కేసులు పెట్టే అవకాశం లేదు.
అలాగే బ్యాంకులు ఫిర్యాదు చేస్తే తప్ప కేసులు పెట్టలేరు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇప్పటికే ఫిర్యాదు చేసింది. కేసులు నమోదయ్యాయి. వీటిపై రఘురామకృష్ణరాజు న్యాయపోరాటం చేస్తున్నారు. ప్రభుత్వంపై ప్రతీ రోజూ విమర్శల దాడి చేస్తున్న రఘురామను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని విజయసాయిరెడ్డి ప్రయత్నిస్తున్నారు.కానీ ఆయన ప్రయత్నాలు మాత్రం ఫలించడం లేదు.