ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల వెనుక బాటు గురించి.. వలసల గురించి అసెంబ్లీలో ఎక్స్పర్ట్స్ రాసిచ్చిన స్క్రిప్ట్‌ను ప్రాక్టీస్ చేసి మరీ వచ్చి చెప్పిన సీఎం జగన్… ఆయనతో పాటు ఎంతో కొంత నాలెడ్జబుల్ పర్సన్‌గా వైసీపీలోనే కాదు ప్రజల్లోనూ గుర్తింపు తెచ్చుకున్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వంటి వారు బహు బాగా చెప్పారు. అందుకే మూడు రాజధానులు తమ విధానమని అసెంబ్లీ బల్లగుద్ది మరీ చెప్పారు. కోర్టు తీర్పును ఆక్షేపించారు.కోర్టు తీర్పు ను ఆక్షించడంపై కింద చెప్పుకుందాం.. ఇప్పుడు ప్రభుత్వం మూడు రాజధానులు తప్ప మరో మార్గమేదీ లేదన్నట్లుగా వాదించిన వైనాన్ని ఓ సారి సమీక్షించుకుందాం..! సీఎం జగన్ ఏమంటారంటే… అన్ని ప్రాంతాల అభివృద్ధికి మూడు రాజధానులు అవసరం అన్నారు. దీనికి వికేంద్రీకరణ అని పేరు పెట్టారు. చాలా బాగుంది. మరి ఈ విధానం గురించి ప్రజలకు ముందే ఎందుకు చెప్పలేదు? అధికారం చేతికి వచ్చేదాకా అమరావతినే బ్రహ్మాండంగా నిర్మిస్తామని ఎందుకు చెప్పారు ? ఇది ప్రధానంగా జగన్ విశ్వసనీయతన ప్రశ్నిస్తూ వేస్తున్న ప్రశ్న.
రాజధాని నిర్ణయం రాష్ట్రానిదే… ఆ నిర్ణయం అయిపోయింది.. అందులో భాగమయ్యారు కదా !
రాజధాని నిర్ణయం రాష్టానిదే అని సీఎం జగన్ అసెంబ్లీలో పదే పదే చెప్పారు. కేంద్రం కూడా అదే చెప్పింది. నిజమే … రాష్ట్రానిదే నిర్ణయం. రాజధాని లేని రాష్ట్రానికి రాజధానిని ఎంచుకునే అవకాశం రాష్ట్రానికి వచ్చింది. రాష్ట్రానికి మధ్యలో ఉంటుందని అమరావతిని నిర్ణయించారు. ఆ నిర్ణయంలో అందరూ భాగమయ్యారు. చివరికి ఇప్పుడు మూడు రాజధానుల ముచ్చట చెబుతున్న జగన్ కూడా భాగమయ్యారు. తన నోటితో తాను స్వాగతించారు. అంటే..అప్పటికి నిర్ణయం అయిపోయింది. ఇప్పుడు మళ్లీ తనకు అధికారం వచ్చే సరికి ఇంకెవరి అభిప్రాయాలతో సంబంధం లేకుండా మూడు రాజధానులు ప్రకటించేస్తారా ?. మళ్లీ రాష్ట్రానిదే రాజధాని నిర్ణయం అని అడ్డగోలు వాదన వినిపిస్తారు. ఇప్పటికే రాజధాని నిర్ణయం అయిపోయింది. మార్చుకునే అధికారం ఉందో లేదో తర్వాత సంగతి.. కానీ ఓ సారి అంగీకరించి.. కొన్ని వేల మంది ఈ అంశంలో స్టేక్ హోల్డర్లు అయిన తర్వాత వారందర్నీ నష్టపరిచి మూడు రాజధానుల నిర్ణయం తీసుకునే హక్కు మాత్రం ఉండదు.
అమరావతి అందరిది.. మూడు రాజధానులు ఒక్కరిది.. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు ?
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని అంగీకరించినప్పుడు ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ప్రస్తుత సీఎం జగన్.. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. చెవిరెడ్డి.. సభలో లేకపోయినా బొత్స సత్యనారాయణ.. ఉత్తరాంధ్ర.. రాయలసీమ ప్రజలు …మేదావులు ఎవరూ వ్యతిరేకించలేదు. ఏకాభిప్రాయంతో ఆ నిర్ణయం వచ్చింది. కానీ ఇప్పుడు మూడు రాజధానుల విషయంలో ఎవరు సమర్థిస్తున్నారు. ఒక్క వైసీపీ మాత్రమే సమర్థిస్తోంది. మిగతా అన్ని పార్టీలు నిర్మోహమాటంగా తిరస్కరిస్తున్నాయి. అంటే ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా ఉన్నట్లే కదా..! ఈ చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు?
అమరావతికి ఎందుకు అంగీకరించారో భూములిచ్చిన రైతులకు జగన్ సమాధానం చెప్పాలి !
అసెంబ్లీలో సీఎం జగన్ అమరావతిని స్వాగతిస్తూ అన్న మాటలు ఇప్పటికీ ప్రజల చెవుల్లో గింగురుమంటూనే ఉన్నాయి. ముఫ్పై వేల ఎకరాలు కావాలన్నారు. అంతకు ముందు ఆయన రాజధాని నిర్మాణం ఆలోచనను ప్రకటించినప్పుడు కూడా అచ్చంగా చంద్రబాబు గ్రాఫిక్స్‌ను మించి మాటల్లో చూపించారు. అది మొదలు అమరావతి విషయంలో అనేక సార్లు చర్చ జరిగినప్పటికీ.. ఆయన వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. భూసమీకరణ వద్దని చెప్పలేదు. రైతులు భూములు ఇస్తున్నప్పుడు వద్దని చెప్పలేదు. తమ విధానం మూడు రాజధానులుఅని.. తాము అధికారంలోకి వస్తే అదే చేస్తామని ఒక్కటంటే ఒక్క సారీచెప్పలేదు. అసుల మూడు రాజధానులు అనే మాటే ఎవరికీ తెలియదు. చివరికి ఎన్నికలప్పుడు కూడా చెప్పలేదు. అమరావతినే నిర్మిస్తామని.. కావాలంటే మేనిఫెస్టోలో పెడతామని మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా ప్రకటించారు. జగన్ ఇంటి గృహప్రవేశానికి వచ్చిన మూడు ప్రాంతాల నేతలు అమరావతినే రాజధాని అని కుండబద్దలు కొట్టారు. అంత ఎందుకు చివరికి జగన్మోహన్ రెడ్డి కూడా తాను ఇల్లు కట్టుకున్నా రాజధానిని ఎందుకు తరలిస్తానని ప్రశ్నించారు. అంటే అమరావతినే రాజధాని అని ప్రజల్ని నమ్మించి ఓట్లేయించుకుని ఆనక అడ్డంగా మడమ తిప్పారన్నది ఇక్కడ కీలకమైన విషయం. ముందుగా ఈ విషయంలో అమరావతి రైతులకు జగన్ సమాధానం చెప్పి తీరాలి. ఎందుకంటే ఆయన గతంలో ప్రతిపక్ష నేతగా అమరావతి నిర్ణయంలో భాగమయ్యారు, ఇప్పుడు సీఎంగా అమరావతి పీక నొక్కడంలో ప్రధమంగా ఉన్నారు కాబట్టి.
ఇప్పుడు అమరావతి కాదు ఇష్యూ.. రైతులకు న్యాయమే!
ఇప్పుడు అమరావతి రాజధానా… మూడు రాజధానులా అన్నది ఇష్యూ కాదు. మూడేళ్ల పాలనలో “అభివృద్ధి వర్గాలు” ఆంధ్రప్రదేశ్‌పై నమ్మకం కోల్పోయాయి. ఈ విషయం హైదరాబాద్ చుట్టూ జరుగుతున్న అభివృద్ధే చెబుతోంది. వచ్చే ముఫ్పై, నలభై ఏళ్లు ఏపీ ప్రజలకు.. ఉపాధి పరంగానే.. విద్యా, వైద్య పరంగా కూడా హైదరాబాదే రాజధాని. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పినట్లుగా తెలంగాణ వాళ్లు వీసాలు పెట్టకపోతే.. ఏపీ ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటారు.. లేకపోతే వీసాలు పొంది వెళ్లాల్సి ఉంటుంది. అది వేరే విషయం…ఇప్పుడు మూడు రాజధానులు కడతారా… అమరావతినే అభివృద్ధి చేస్తారా అన్నది తర్వాతి విషయం.. ముందు రైతులకు ఎలా న్యాయం చేస్తారో చెప్పాలి. ఆనాడు తమ విధానం మూడు రాజధానులు అంటే రైతులు భూమలు ఇచ్చే వారుకాదు. వారు ఇవ్వకపోతే ఈ రోజు ఈ రాజధాని పంచాయతీనే ఉండేదికాదు. రైతులకు న్యాయం చేయాలన్న కోణంలోనే ప్రస్తుతం పంచాయతీ నడుస్తోంది. అంతే కానీ రాజధాని ఎక్కడ ఉండాలన్నది కాదు. మూడు కాకపోతే ముఫ్పై రాజధానులు పెట్టుకోవచ్చు. ప్రజలు ఐదేళ్లు అధికారం ఇచ్చారు. అంటే.. ఏమైనా చేసేయవచ్చన్న జగన్ ఆలోచనకు తగ్గట్లుగా అది సాధ్యమే. కానీ రైతులకు అన్యాయం చేసి పెడతామంటే.. వ్యవస్థలు ఒప్పుకోవు. అధికారం ఇచ్చింది అన్యాయం చేయమని కాదు. రైతులకు చట్టం ప్రకారం న్యాయం చేసి.. మూడు రాజధానులు పెట్టుకోవడానికి ఇప్పటికీ అవకాశం ఉంది. ఆ భూములకు సీఆర్డీఏ చట్టం ప్రకారం పరిహారం ఇస్తే ఏ కోర్టు కూడా మూడు రాజధానులకు అడ్డు పడదు. ఆ విషయం స్పష్టంగా తీర్పులోనేఉంది., రైతులకు ఇచ్చిన హామీలను చట్ట ప్రకారం అమలు చేయమనే న్యాయస్థానం చెప్పింది. దాన్ని అమలు చేసి తీరాలి.
అమరావతి కట్టడం చేతకాకపోతే.. ఇప్పటిలాగే పాలన చేయవచ్చు కదా .. ఎందుకు మార్చాలి !
అమరావతి నిర్మాణానికి పది .. పదిహేను లక్షల కోట్లు ఖర్చువుతందని సీఎం జగన్ అసెంబ్లీలో లెక్కలు చెప్పారు. ఆ మొత్తంరాజధాని ప్రాంతలలో .౦౦౦౦౦1 శాతంఅన్నారు. కరెక్టే ..సీఎం ఏదీ చెబితే అదేనిజం. మరి ఎవరు ఖర్చుపెట్టమన్నారు..? ప్రభుత్వ నిర్వహణకే డబ్బుల్లేక… చెత్త పన్నుల పేరుతోప్రజల నుంచి వందా.. రెండు వందలను బెదిరించి మరీ వసూలు చేస్తున్న పరిస్థితి కాబట్టి అంత మొత్తం వెచ్చించి కట్టలేరు. మరి ఎందుకు విశాఖకు మార్చాలి ? . ఇప్పుడు నడుస్తున్న వాటితోనే నడుపుకోవచ్చు కదా … ఉన్న నిర్మాణాలు పూర్తి చేస్తే చాలు ఉద్యోగులందరికీ వసతి లభిస్తుంది కాదా. పాలన అక్కడి నుంచే కొనసాగించి… మిగిలిన అభివృద్ధి మొత్తం అనుకున్నట్లుగా అన్ని ప్రాంతాల్లో చేయవచ్చు కదా ఎవరు అడ్డుకున్నారు? ఇప్పుడు అమరావతిలో ఏం లేవు.. సెక్రటేరియట్ ఉంది.. సీఎం క్యాంపాఫీస్ ఉంది.. హైకోర్టు ఉంది.. చివరికి అసెంబ్లీ కూడా ఉంది . ఇంకేం కొరతవచ్చింది. ఇప్పుడు కొత్తగా అన్నీ వెదుక్కుని వేరే ప్రాంతానికి వెళ్లాల్సిన అవసరం ఏముంది?
కోర్టు తీర్పును వక్రీకరించి న్యాయవ్యవస్థపై నీలాపనిందలు !
కోర్టు చట్టాలు చేయవద్దని చెప్పిందా ? కేవలం మూడు రాజధానుల అంశంలో ఇంతకు ముందు చేసిన సీఆర్డీఏ చట్టాన్ని… ప్రభుత్వం చేసుకున్న చట్టం ప్రకారం అమలు చేయాలని చెప్పింది. మరో చట్టం చేసి స్టేక్ హోల్డర్ల హక్కులను కాలరాసే చట్టం చేయడానికి వీల్లేదని చెప్పింది. అంత మాత్రం దానికే శాసన వ్యవస్థనే న్యాయవ్యవస్థ శాసిస్తోందని గగ్గోలు పెడితే ఎలా..? అసెంబ్లీలో సీఎం జగన్ సహా మాట్లాడిన వైసీపీ సభ్యులందరూ న్యాయవ్యవస్థకు దురుద్దేశాలు అంటగట్టారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి వారయితే.. ఏ బెంచ్ మీదకు వెళ్తే ఎలాంటి తీర్పు వస్తుందో తెలిసిపోతోందన్నారు. ఈయన మాటలు న్యాయవ్యవస్థను మరీ దారుణంగా వంచించేలా ఉన్నాయి. ఎన్నో బెంచ్‌లను మార్చి అనుకూల తీర్పులను ప్రభుత్వం తెచ్చుకుంది. చివరికి ఈ చర్చ జరుగుతున్న సమయంలో.. టీటీడీ భవనాన్ని కలెక్టరేట్‌గా మార్చే విషయంలో సింగిల్ జడ్జి ఇచ్చినతీర్పుపై డివిజన్ బెంచ్‌కు వెళ్లి ప్రభుత్వం అనుకూల తీర్పు తెచ్చుకుంది. దీన్ని ఏమంటారు ? చెవిరెడ్డి చెప్పిన దాని ప్రకారం.. న్యాయవ్యవస్థను కించపర్చినట్లు కాదా..?. ప్రభుత్వం రాజ్యాంగవ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నందునే కోర్టుల్లో వ్యతిరేక తీర్పులు వచ్చాయి. రంగులు దగ్గర్నుంచి రాజ్యాంగ పదవిలో ఉన్న ఎస్ఈని తొలగించడం వరకూ.. రాజ్యాంగాన్ని అడ్డగోలుగా ఉల్లంఘించి…న్యాయవ్యవస్థపైనే నిందలు వేయడం.. మితిమీరిన మనస్థత్వం ఉన్న పాలకులకే సొంతం. వ్యతిరేక తీర్పులువస్తున్నాయని న్యాయవ్యవస్థపై చేసిన దాడిని దేశం ఎప్పటికీ మర్చిపోదు. చీఫ్ జస్టిస్ అవుతారని తెలిసి.. వారి కుటుంబసభ్యులకు ఉన్న అరకొర భూమిని చూపించి అదే అవినీతి అని నిందలు వేసే ధైర్యం చేయడం వ్యవస్థలపై చేసిన దాడే.
ఇప్పటికీ మూడు రాజధానులకు చాన్స్ ఉంది..రైతులకు అన్యాయం చేయకుండా !
చట్టబద్దంగా మూడు రాజధానులు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి ఇప్పటికీ ఒక మార్గం ఉంది. సీఆర్డీఏతో రైతులు చేసుకున్న ఒప్పందంలో 9.14 ఫాంలోని 18వ షరతు ప్రకారం.. ప్రభుత్వం ఏ షరతునైనా ఉల్లంఘిస్తే 2013 చట్టం కింద పరిహారమివ్వాలని పేర్కొన్నారు. భూసమీకరణ విధానంలో భూములు తీసుకున్నప్పుడు రైతులు మొదటి పార్టీగా, ప్రభుత్వం రెండోపార్టీగా పేర్కొంటూ ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందంలోని 18వ షరతులో…” షెడ్యూలు ఆస్తిపై అభివృద్ధి పనులు నిలుపుదల చేయాలని మొదటి పార్టీ కోరరాదు. అదేవిధంగా రెండో పార్టీ.. అంటే ప్రభుత్వం కనుక ఒప్పందం ఉల్లంఘిస్తే నష్టపరిహారం.. చట్టప్రకారం అర్హమైన నష్టపరిహారాలు పొందుటకు అర్హులై ఉన్నారు..” అని పేర్కొన్నారు. దీనిప్రకారం రాజధానిని తరలించి.. రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది. న్యాయపరంగా ఒప్పందాల్ని ఉల్లంఘిస్తే… 2013 భూసేకరణ చట్టం ప్రకారం .. రైతుల నుంచి సమీకరించిన 33వేల ఎకరాలకు పరిహారం చెల్లిస్తే రాజధానులను ఏర్పాటు చేయవచ్చు.ఏ కోర్టూ అడ్డుకోలేదు. ఇంకా చెప్పాలంటే… అసలు అమరావతిలో అసెంబ్లీ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు.
ఇంకా మూడు రాజధానుల వాదన చేస్తే రాజ్యాంగంపై యుద్ధం చేసినట్లే !
మూడు రాజధానుల అంశంపై ప్రభుత్వం ఇప్పటికీ న్యాయవ్యవస్థ మీద కూడా దాడి అదే మొండి వైఖరితో ముందుకెళ్తే.. రాజ్యాంగంపై యుద్ధం చేస్తున్నట్లుగానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే.. నైతికంగా .. చట్ట పరంగా.., సాంకేతికంగా.. ఇంకా ఆర్థిక పరంగా కూడా మూడు రాజధానులు వీగిపోయాయి. అమరావతికి అంగీకరించి.. మూడు రాజధానులన్నప్పుడే నైతికంతే తనను తాను దిగజార్చుకున్నారు జగన్. ఇక చట్ట పరంగా.. సాంకేతికంగా కూడా సాధ్యం కాదని తేలిపోయింది. ఇక ఆర్థిక పరంగా చెప్పాల్సిన పనిలేదు.
చరిత్రలో ఎంతో పాలకులు.. ఎన్నో దేశాలను.. ఎన్నో ప్రాంతాలను పరిపాలించి ఉంటారు… అందరూ ఒకే రకంగా పరిపాలించలేదు. చాలా మంది ప్రజలపై యుద్ధం చేశారు. అధికారం అండతో వ్యవస్థల్ని చెరబట్టారు. చివరికి అలాంటి వారు ఏమైపోయారో.. చరిత్ర పాఠాలే చెబుతూ ఉంటాయి. వీటిని గుర్తుంచుకుని రాజ్యాంగంపై యుద్ధం చేయడం ఆపేస్తేనే అలాంటి నేతల జాబితాలో చేరకుండా ఉంటారు.